రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

బూర్గంపాడు, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ శివారు ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏన్కూర్ మండలం జన్నారం గ్రామానికి చెందిన వెంగళరావు రామవరం లో నివాసం ఉంటున్నాడు. భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నారు. డ్యూటీకి వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం అతను ప్రయాణిస్తున్న బైకును ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ఘటనలో వెంగలరావు(48) తీవ్ర గాయాలకు గురయ్యారు.

స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, ఈఎంఎటీ జ్యోతి, పైలెట్ విజయ్ భాస్కర్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితునికి ప్రాథమిక చికిత్స అందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ వెంగళరావు మృతి చెందాడు. మృతుడు వెంగళరావుకి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు భద్రత చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలి.. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వేగ నియంత్రణ పాటించడం,జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించ వచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం వీడకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించి తీరాలని అన్నారు. అదేవిధంగా ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అధికారులు రోడ్డు భద్రత చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply