విధేయతకు మారుపేరు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
విధేయతకు మారుపేరు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనబట్ల దినేష్
ధర్మపురి, ఆంధ్రప్రభ: విధేయతకు, నిబద్ధతకు మారుపేరు నాయకుడు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనబట్ల దినేష్ అన్నారు. మంగళవారం ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘం హాల్‌లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. 2006లో జడ్పీటీసీగా టికెట్ ఇచ్చినప్పటి నుంచి వెంకటస్వామి కుటుంబానికి విధేయతతో కొనసాగుతున్నారని తెలిపారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోటోను తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ, అలాంటి నాయకుడిపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ధర్మపురిలో ఇసుక వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
ఇసుక వ్యాపారంలో పనిచేస్తున్న వారంతా నిరుపేదలే అని, ట్రాక్టర్ నడిపితేనే జీవనం సాగించే పరిస్థితి ఉందని చెప్పారు. ధర్మపురిలో అభివృద్ధి పనుల కోసం పోసిన ఇసుక డంపులను చూసి “ఇసుక మాఫియా” అంటూ ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ధర్మపురి ప్రాంతంలో పెద్ద స్థాయిలో ఇసుక వ్యాపారం జరిగిందని, నేడు కేవలం కొంతమంది చిరు వ్యాపారులు మాత్రమే కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు ఇసుక వ్యాపారంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల కోసం ఇసుక అవసరం ఉన్నందునే వ్యాపారం కొనసాగుతోందని, దీనిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గతంలో ఇసుక వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గతంలో చేసిన సేవా కార్యక్రమాలపై కూడా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు పోరాడకుండా కేవలం ఆరోపణలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు.
ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న వారు రైతుల సమస్యలను ఎంతవరకు తెలుసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమని, ప్రతిపక్షాలు కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీపురిశెట్టి రాజేష్, వెలగటూర్ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంగ నర్సింహులు, నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
