మృతురాలి కుటుంబానికి రూ.22 వేల ఆర్థిక సాయం
ఆలేరు, ఆంధ్రప్రభ: ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన బరుపతి పోషమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన మాల కుటుంబ సభ్యులు, యువకులు స్వచ్ఛందంగా చందాలు సేకరించి రూ.22 వేల ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వారు, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన మాల కుటుంబ సభ్యులు, యువకుల సేవాభావాన్ని గ్రామ పెద్దలు, స్థానికులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.
