Switzerland Missing Couple | రూ.50 కోట్ల మోసమా.. అదృశ్యమా?
Switzerland Missing Couple | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన దంపతులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నగరంలోని చర్లపల్లికి చెందిన పబ్బా చంద్రశేఖర్, స్వప్న దంపతులు జూన్ 22న హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో అనుమానం వ్యక్తం చేసిన వారి కుమార్తె చర్లపల్లి పోలీసులను ఆశ్రయించింది.
కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితమే చంద్రశేఖర్ దంపతులపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అధిక వడ్డీ ఇస్తామని నమ్మించి సుమారు రూ.50 కోట్లు వసూలు చేసి, అనంతరం స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇప్పటికే దంపతులు అదృశ్యమై దాదాపు 18 రోజులు గడిచినా వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల జాడ కోసం కుమార్తె ఎదురుచూస్తుండగా, ఈ వ్యవహారంలో మిస్సింగ్ కేసుతో పాటు ఆర్థిక లావాదేవీల కోణంలోనూ పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
