Telangana | అలసత్వమా.. ఆసక్తి లేదా..?

Telangana | అలసత్వమా.. ఆసక్తి లేదా..?

Telangana | అట్టహాసం లేకపోవడం వెనుక కారణాలేమిటి?
కేడర్‌లో ఉత్సాహం – నాయకత్వంపై సందేహాలు
ఎన్నికల ఓటమి ప్రభావం ఇంకా కొనసాగుతుందా?
పునర్నిర్మాణానికి కొత్త వ్యూహాలు అవసరమా?

Telangana | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అలసత్వమా.. ఆసక్తి లేదా..? అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ రాజకీయ పార్టీ అయినా తన ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించడం సహజం. అది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు… పార్టీ శక్తి, ఐక్యత, భవిష్యత్ వ్యూహాలకు సంకేతం. కానీ ఈసారి బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల విషయంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆశించిన స్థాయిలో ఆసక్తి చూపలేదనే అభిప్రాయం బలపడుతోంది.

ఈ రోజు పార్టీ ప్లీనరీని భారీ స్థాయిలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, తీవ్ర ఎండలను కారణంగా చూపిస్తూ కేవలం కొద్దిమంది రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంగా పరిమితం చేసినట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికారంలో లేని సమయంలో ఇలాంటి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తే పార్టీ నాయకుల్లోనే కాదు, కేడర్‌లోనూ కొత్త జోష్ వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ఓటమి తర్వాత కార్యకర్తల్లో నమ్మకం పెంచడానికి, నాయకత్వంపై విశ్వాసం నిలబెట్టడానికి ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు, రాజకీయ ప్రత్యర్థులకు కూడా తమ సత్తా ఏమిటో చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఇందుకోసం గులాబీ బాస్ సిద్ధంగా లేరనే భావన కనిపిస్తోంది.

ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. అయితే గ్రామాలు, పట్టణాల్లో మాత్రం గులాబీ దళం పార్టీ జెండాలను ఆవిష్కరించి సంబరాలు చేసుకుంటూ మంచి ఉత్సాహాన్ని ప్రదర్శించింది. కింది స్థాయి కార్యకర్తలు ఇంకా పార్టీపై నమ్మకంతో ఉన్నారనే విషయం స్పష్టమైంది.

ప్రజలకు, కార్యకర్తలకు కేసీఆర్ దూరంగా ఉండటమే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అనే విమర్శలు అప్పటినుంచే వినిపిస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లకుండా, కేడర్‌తో మమేకం కాకుండా కేవలం రాజకీయ వ్యూహాలతోనే పార్టీని నిలబెట్టడం కష్టమనే అభిప్రాయం పార్టీ అంతర్గతంగానూ వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా ప్రజలతో మమేకమవుతూ, కార్యకర్తలకు భరోసా ఇస్తూ ముందుకు సాగితేనే పార్టీకి మళ్లీ బలమైన పునాది ఏర్పడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వంటి నాయకులు “మహానాడు” వంటి కార్యక్రమాల ద్వారా నేతల్లోనూ, కేడర్‌లోనూ కొత్త ఉత్సాహం నింపిన ఉదాహరణలు ఉన్నాయి.

ఇప్పటికైనా చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తే, బీఆర్ఎస్ మళ్లీ బలంగా నిలబడే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. లేదంటే… ఆవిర్భావ వేడుకల నిర్లక్ష్యం, భవిష్యత్ రాజకీయ బలహీనతకు సంకేతంగా మారే ప్రమాదం లేకపోలేదు.

Leave a Reply