చర్లపల్లి–తిరుచిరాపల్లి మధ్య కొత్త వారాంత ఎక్స్‌ప్రెస్

చర్లపల్లి–తిరుచిరాపల్లి మధ్య కొత్త వారాంత ఎక్స్‌ప్రెస్
విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు మధ్య రైలు ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రత్యేక రైలుగా నడుస్తున్న చర్లపల్లి–తిరుచిరాపల్లి సర్వీసును రెగ్యులర్ వారాంత ఎక్స్‌ప్రెస్‌గా మార్చేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
రైలు నెం.17077 చర్లపల్లి–తిరుచిరాపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది. ఈ సర్వీసు జూలై 7, 2026 నుంచి ప్రారంభం కానుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నెం.17078 తిరుచిరాపల్లి–చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం రాత్రి 9.30 గంటలకు తిరుచిరాపల్లి నుంచి బయలుదేరి గురువారం రాత్రి 9.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ సర్వీసు జూలై 8, 2026 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, శ్రీరంగం వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్లే యాత్రికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు ఈ సర్వీసు ఉపయోగకరంగా మారనుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తిరుపతి, శ్రీరంగం, తిరువణ్ణామలై వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఇది ప్రత్యేక సౌకర్యంగా నిలవనుంది.
గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి తమిళనాడు వైపు ప్రత్యక్ష కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. రైలులో ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు కోచ్‌లు పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
