‘తల్లికి వందనం’ ఫిర్యాదులన్నీ ప్రభుత్వానికి పంపిస్తాం

  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా

పాయకాపురం, ఆంధ్రప్రభ : ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ప్రభుత్వానికి పంపించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో బొండా ఉమామహేశ్వరరావుతో పాటు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వెంటనే పరిష్కారం సాధ్యం కాకపోయినా, సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేసే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి ఘంటా కృష్ణమోహన్, భార్గవ్, శివ, మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, పార్లమెంట్ కార్యదర్శి ఎస్.కె. గౌసియా, గరిమెళ్ల రాధిక, కంచేటి నాగరాజు, రాజానా బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.