డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

  • చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ భారీ నిరసన
  • మంత్రి లోకేష్ రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలి
  • చిత్తూరులో వైసీపీ నేతల డిమాండ్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర, పారదర్శక సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టింది. నిరసన అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)కు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్‌తో పాటు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తూ ప్రభుత్వం డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు, ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలు నిజంగా పారదర్శకంగా జరిగి ఉంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో నిబంధనలను తుంగలో తొక్కి ఉద్యోగాల అమ్మకాలకు పాల్పడ్డారని, జీవోలను మార్చి అభ్యర్థులను మోసం చేశారని ఆరోపించారు.

నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేసి, నకిలీ క్రీడా ధ్రువపత్రాలతో వచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా విషయంలో ప్రభుత్వం వరుసగా జీవోలు జారీ చేసి తిరిగి వాటిని మార్చడం వెనుక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణలో మొదటి నుంచే అనేక లోపాలు చోటుచేసుకున్నాయని, నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్‌కు నైతిక బాధ్యత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణను ఎదుర్కోవాలని నేతలు డిమాండ్ చేశారు.

డీఎస్సీ అక్రమాలకు బాధ్యులైన అధికారులు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని కోరారు. డీఆర్వోకు సమర్పించిన వినతిపత్రంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు విద్యార్థులకు సంబంధించిన పలు అంశాలను కూడా ప్రస్తావించారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలను విస్మరించకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, అప్పుడే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.