ఎన్ఆర్ఐ, గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమంపై సమావేశం

ఎన్ఆర్ఐ, గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమంపై సమావేశం
- తెలంగాణ ప్రతినిధులతో కలిసి ఏపీ ప్రభుత్వం అధ్యయనం
అచ్చంపేట, ఆంధ్రప్రభ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు, గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించిన విధానాల అమలుపై ఈ రోజు అమరావతిలో ఒక కీలక కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారులు వేమూరి రవి నేతృత్వం వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎఫ్‌ఎస్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, కమిటీ సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావుతో పాటు ప్రొఫెసర్లు జునుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమం కోసం రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, సహాయక కార్యక్రమాలు, భద్రతా చర్యలు, అత్యవసర సేవలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారం, వారి కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించడం, విదేశాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించడం వంటి ముఖ్యమైన అంశాలపై పరస్పర అవగాహనతో అధ్యయనం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

