Ap-Cm-Angry : శాంతి భద్రతల్లో రాజీ లేదు Andhra Prabha Top News
Ap-Cm-Angry : శాంతి భద్రతల్లో రాజీ లేదు Andhra Prabha Top News
- రౌడీలు, గుండాలను
- ప్రోత్సహించవద్దు
- ప్రశాంత కుప్పంలో
- అరాచకాలకు పాల్పడ్డారు
- గులకరాయి, కోడికత్తితో
- ప్రజలను తప్పుదోవ పట్టించారు
- అమరావతే శాశ్వత రాజధాని
- ఆ పేరు పలకని వీరికి
- వాటికన్ కావాలట
- స్వర్ణ కుప్పంలో బంగారు వెలికితీస్తాం
( చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో

రాష్ట్రంలో శాంతిభద్రతలు, పెట్టుబడులు, అభివృద్ధి ఒకదానికొకటి విడదీయరాని అంశాలని, ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో రూ.118 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక బస్టాండు, ఆర్టీసీ డిపో శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగిస్తూ రాష్ట్ర రాజకీయాలు, శాంతిభద్రతలు, కుప్పం అభివృద్ధి, నేర రాజకీయాలు, అమరావతి రాజధాని, గత ప్రభుత్వ పాలన, ప్రజల బాధ్యత వంటి అంశాలపై విస్తృతంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
Ap-Cm-Angry : రాజకీయాల్లో రౌడీలు.. గూండాలా

రాజకీయాల్లో తనకు దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం ఉందని, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశానని చంద్రబాబు గుర్తు చేశారు. ఒకప్పుడు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై రాజకీయాలు చేసే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు రౌడీలు, గుండాలు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులతోనే రాజకీయంగా తలపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు. తిరుపతి సమీపంలో 2003లో తనపై జరిగిన క్లేమోర్ మైన్ల దాడిని గుర్తు చేసుకుంటూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఆ ఘటనలో భగవంతుడి దయతో తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని చెప్పారు. అయినప్పటికీ ప్రజల కోసం పనిచేయడంలో భయపడలేదని, ప్రజాసేవే తన లక్ష్యమని పేర్కొన్నారు.
Ap-Cm-Angry : అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలొచ్చాయి

రాయలసీమలో ఒకప్పుడు ముఠా కక్షలు, ప్రతీకార హత్యలు, కుటుంబాల మధ్య వైరం, గ్రామాల మధ్య ఘర్షణలు తీవ్రంగా ఉండేవని ఆయన గుర్తు చేశారు. ఒక కుటుంబం మరో కుటుంబాన్ని అంతం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు ఉండేవని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపి ముఠా కక్షలను పూర్తిగా అణచివేశామని తెలిపారు. తప్పు చేసిన వారు తమ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు నిలబెట్టామని, నేడు రాయలసీమ ప్రశాంతంగా మారిందన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ కథలతో సినిమాలు వచ్చేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడం శాంతి నెలకొన్నదానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మత ఘర్షణలు, కత్తిపోట్లు, కర్ఫ్యూలు సాధారణంగా ఉండేవని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో మతసామరస్యం నెలకొని ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆకర్షించగలిగామని తెలిపారు.
Ap-Cm-Angry : శాంతితో పెట్టుబడులొస్తాయి

శాంతిభద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు, అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో తనను ప్రజల్లోకి రానీయకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అన్నా క్యాంటీన్ నిర్వహణను కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని, తాను బెంగళూరుకు వెళ్లిన వెంటనే తన వెంట వచ్చిన కార్యకర్తలను అరెస్టు చేశారని చెప్పారు. తనను కూడా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. అలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చట్టపాలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, మహిళలకు రక్షణ, పెట్టుబడిదారులకు భద్రత, ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే ముందు శాంతిభద్రతలు ఉండాలని, ఆస్తులకు రక్షణ ఉంటుందనే నమ్మకం పెట్టుబడిదారుల్లో కలగాలని చెప్పారు. కుప్పం ప్రశాంతతకు మారుపేరుగా ఉండేదని, అయితే గత కొన్నేళ్లలో అక్రమ రవాణా, గంజాయి ముఠాలు, రౌడీయిజం, బెదిరింపులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు.
Ap-Cm-Angry : రౌడీలంటే భయం లేదు

రౌడీయిజం చేసేవారికి తాను భయపడనని, అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టి ప్రజల ముందే దోషులుగా నిరూపించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజలు కూడా నేరచరిత్ర ఉన్న వ్యక్తులను రాజకీయాల్లో ప్రోత్సహించవద్దని, ఓటు వేయడానికి ముందు వారి గతాన్ని గుర్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, మొదట గుండెపోటుగా ప్రచారం చేసి తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఆ కేసు దర్యాప్తు సమయంలో బయటకు వచ్చిన అంశాలపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. అదే విధంగా ఎన్నికల సమయంలో జరిగిన కోడికత్తి ఘటన, గులకరాయి ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రజల సానుభూతిని పొందేందుకు రాజకీయ డ్రామాలు ఆడారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు, కుట్రలు, నాటకాలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. కొన్ని దారుణ హత్యలు, వైద్యుడి హత్య వంటి ఘటనలను కూడా ప్రస్తావిస్తూ, హింసను రాజకీయ ఆయుధంగా మార్చడం ప్రమాదకరమన్నారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటే వారిపైనే దాడులు చేయడం సరికాదని, చట్టాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.
Ap-Cm-Angry : అమరావతే శాశ్వత రాజధాని
రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అమరావతే రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని, దానిని మార్చే అవకాశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టాలు అమల్లో ఉన్నాయని, ప్రపంచంలో ఎక్కడా ఇష్టానుసారంగా రాజధానులను మార్చే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. అమరావతి తెలుగు జాతి గర్వకారణమని, దేవతల రాజధానిగా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతి పేరు కూడా పలకకుండా కొత్త పేర్లు చెబుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. అమరావతి వద్దని చెప్పేవారికి వాటికన్ కావాలా అనే ప్రశ్నను లేవనెత్తుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతేనని స్పష్టం చేశారు. సభలో ప్రజలతో కలిసి మన రాజధాని అమరావతి అంటూ పలుమార్లు నినాదాలు చేయించారు.
Ap-Cm-Angry : కుప్నం ఇక బంగారు బాట
స్వర్ణ కుప్పం దార్శనిక ప్రణాళికలో భాగంగా కుప్పాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పరిశ్రమలు, ఆధునిక మౌలిక వసతులు, నాణ్యమైన వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలతో పాటు ప్రశాంతమైన సామాజిక వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. కుప్పం పరిసర ప్రాంతాల్లో బంగారు నిల్వలపై సమాచారం ఉందని, ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తులో బంగారు వెలికితీతకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. కుప్పం పేరుకు తగ్గట్టుగానే స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపడతామని, ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఉపాధ్యక్షులు మునిరత్నం, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టిడిపి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
