స్టెరాయిడ్స్ మాఫియా బట్టబయలు…
- టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
- జిమ్‌లలో స్టెరాయిడ్స్ దందా..
- జిమ్ ట్రైనర్ సహా ఆరుగురు అరెస్ట్
- ఏఐతో నకిలీ ప్రిస్క్రిప్షన్లు..
- స్టెరాయిడ్స్ రాకెట్ గుట్టురట్టు
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : త్వరగా కండరాలు పెంచుకోవాలనే యువత ఆకాంక్షను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టైంది. స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో జిమ్ ట్రైనర్ సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి రూ.6.50 లక్షల విలువైన 770కు పైగా స్టెరాయిడ్స్ వయల్స్, యాంపూల్స్, ఇంజెక్షన్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్ బట్టే శివ, మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్‌తో పాటు మరో నలుగురు సబ్-డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నిందితులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్టెరాయిడ్స్‌ను యువతకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచి సరఫరా..
నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘మెడ్‌హౌస్ ఫార్మా’, పంజాబ్‌కు చెందిన ‘షిప్ రాకెట్’ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి, కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముదిద్ చౌహాన్, పంజాబ్‌కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. కొందరు యువకులు ఏఐ సహాయంతో నకిలీ వైద్యుల ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి మెడికల్ షాపుల నుంచి కూడా స్టెరాయిడ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
జిమ్‌లలో ఆకస్మిక తనిఖీలు..
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇకపై నగరంలోని జిమ్‌లు, జిమ్ ట్రైనర్లు, సభ్యుల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి స్టెరాయిడ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైద్యుల సూచన లేకుండా స్టెరాయిడ్స్ వినియోగించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
