TMC Internal Crisis | పార్టీకి బెంగాల్ అధ్యక్షురాలు రాజీనామా

TMC Internal Crisis | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు.

శనివారం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఆమె రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు పార్టీ బ్యాంకు ఖాతాల ఆథరైజ్డ్ సిగ్నేటరీ బాధ్యతలు, ఎన్నికల సంఘం వద్ద పార్టీ ప్రతినిధిగా ఉన్న పదవుల నుంచి కూడా తప్పుకున్నారు. తన రాజీనామా లేఖలో మమతా బెనర్జీపై తనకు గౌరవం ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీ పాత కమిటీలను రద్దు చేసి చంద్రిమను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపింది.

అదేవిధంగా, పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులైన రితబ్రత బెనర్జీ వర్గంతో పలువురు ఎమ్మెల్యేలు చేరుతున్నట్లు సమాచారం. మరోవైపు లోక్‌సభలో టీఎంసీకి చెందిన 28 మంది ఎంపీలలో సుమారు 20 మంది ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై టీఎంసీ నేతలు భిన్నంగా స్పందించారు. చంద్రిమ రాజీనామా సరైన నిర్ణయం కాదని కొందరు విమర్శించగా, బీజేపీ నేతలు మాత్రం ఇది టీఎంసీ బలహీనతకు సంకేతమని వ్యాఖ్యానించారు.