Dairy-Farmers-Allege : ఆయన పితుకుడే వేరబ్బా Andhra Prabha Top Story
Dairy-Farmers-Allege : ఆయన పితుకుడే వేరబ్బా Andhra Prabha Top Story
Dairy-Farmers-Allege : ఆయన పితుకుడే వేరబ్బా Andhra Prabha Top Story
- జస్ట్ రెండు వేలే
- నోటులిస్తే ఓకే
- లేదో.. సర్టిఫికెట్ నో
- పాడి రైతు నుంచి ఏడీ పిండుడే పిండుడు
- బ్యాంకు రుణం కోసం
- ఏడీ సర్టిఫికెట్ అవసరం
- ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట రైతులు కంటతడి

నోటిమాటల్లో రైతు సంక్షేమం.. క్షేత్రస్థాయిలో మాత్రం మామూళ్ల రాజ్యం. ప్రభుత్వ పథకాలతో పాడి రైతులను ప్రోత్సహించాల్సిన అధికార యంత్రాంగమే కొందరి చేతుల్లో ఆదాయ మార్గంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకు రుణం కోసం తప్పనిసరిగా అవసరమయ్యే ఏడీ సర్టిఫికెట్ జారీని కొందరు అధికారుల ‘ఆదాయ వనరుగా’ మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫికెట్ కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేదంటే ఫైలు ముందుకు కదలదనే పరిస్థితి నెలకొందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల భారం తగ్గించుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరిగే రైతులు, రుణం రాకముందే అధికారులకు మామూళ్లు చెల్లించాల్సి రావడం మరింత భారంగా మారింది. ముఖ్యంగా ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల రైతులు ఈ అక్రమ వసూళ్లతో నష్టపోతున్నామని వాపోతున్నారు.
( తిరుపతి టాస్క్ ఫోర్స్ , ఆంధ్రప్రభ):
ప్రభుత్వ పథకాల ద్వారా పాడి రైతులకు ఆర్థికంగా చేయూత అందించాల్సిన వ్యవస్థలోనే అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవసరమైన ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్) కార్యాలయ సర్టిఫికెట్ జారీ పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అవసరాన్ని అవకాశంగా మార్చుకుని కొందరు అధికారులు రైతుల నుంచి మామూళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాలకు చెందిన పాడి రైతులు ఈ వ్యవహారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Dairy-Farmers-Allege : సర్టిఫికెట్ తప్పనిసరి
పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, బ్యాంకులు వివిధ రకాల రుణ సదుపాయాలు కల్పిస్తున్నాయి. పాడి పశువుల కొనుగోలు, పశువుల షెడ్ల నిర్మాణం, పాల ఉత్పత్తి విస్తరణ వంటి అవసరాల కోసం రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ రుణాలు పొందేందుకు సంబంధిత శాఖ నుంచి జారీ చేసే ఏడీ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ లేకుండా రుణ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రైతులు సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితినే ఆసరాగా చేసుకుని సర్టిఫికెట్ జారీ పేరుతో రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్టిఫికెట్ త్వరగా కావాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందేనని, డబ్బులు చెల్లించిన వారి పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణం ఆలస్యం అయితే పాడి పరిశ్రమకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఆలస్యమవుతాయనే భయంతో రైతులు అధికారులు అడిగిన మొత్తాన్ని చెల్లించక తప్పడం లేదని వాపోతున్నారు.
Dairy-Farmers-Allege : 2000 ఇస్తేనే సర్టిఫికెట్

గేదెల రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్న పాడి రైతుల నుంచి ఒక్కో దరఖాస్తుకు రూ.2,000 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం రుణం పొందే ముందు పశువులకు బీమా చేయించడం, బర్రెలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాటికి గుర్తింపు ముద్ర (కమ్మ) వేయడం, అనంతరం సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలు చేయాలంటే రైతుల నుంచి రూ.2,000 వసూలు చేసి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రుణం కోసం ఎదురుచూస్తున్న రైతులు అడిగిన మొత్తం చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దీంతో ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమవుతుండగా, అక్రమ వసూళ్లు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Dairy-Farmers-Allege : బంగారు లోనుకు రూ. 200లు

పశువులపై బంగారు రుణాలు పొందాలంటే మరో వ్యవహారం ఉంది. ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో యూనియన్ బ్యాంకులు ఎక్కువగా పాడి పశువులపై గోల్డ్ రుణాలు మంజూరు చేస్తాయి. ఆయా మండలాల పాడి రైతులు బ్యాంకుల నుంచి బంగారం తనఖా పెట్టి రుణం పొందాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ పుల్లూరు గోవర్ధన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రైతులు నాయుడుపేట చేరుకుని సర్టిఫికెట్ పొందాలి. ఈ అవకాశాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ గోవర్ధన్ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సర్టిఫికెట్ కోసం వచ్చే రైతుల నుంచి బలవంతంగా రూ.200 వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారికి సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. దీంతో చేసేది లేక పాడి రైతులు అడిగినంతా చెల్లించి సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Dairy-Farmers-Allege : చేసేది లేక…

ముఖ్యంగా ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాలకు చెందిన రైతులు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు రుణాల కోసం సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో కార్యాలయానికి వెళ్లే ప్రతి రైతు ఒకే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. సర్టిఫికెట్ కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగడం, చివరకు డబ్బులు చెల్లించిన తర్వాతే పని పూర్తవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రుణం పొందకముందే అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలు అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. అయితే సర్టిఫికెట్ జారీ ప్రక్రియలోనే అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం వల్ల రైతుల్లో అసంతృప్తి పెరుగుతోంది. అవసరం పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేసే ధోరణికి అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.
Dairy-Farmers-Allege : చర్యలు తీసుకోవాలి
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులే అధిక సంఖ్యలో పాడి పరిశ్రమపై ఆధారపడుతున్నారు. కుటుంబ పోషణకు ప్రధాన ఆదాయ వనరుగా పాల ఉత్పత్తిని నమ్ముకున్న రైతులకు ప్రతి రూపాయి విలువైనదే. అలాంటి సమయంలో ప్రభుత్వ కార్యాలయంలోనే అదనపు భారం మోపడం వారి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, ఉచితంగా అందాల్సిన చోట డబ్బులు చెల్లించాల్సి రావడం బాధాకరమని వారు అంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్టిఫికెట్ జారీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చడంతో పాటు, రైతుల నుంచి ఎలాంటి అక్రమ వసూళ్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆరోపణల్లో నిజానిజాలు తేల్చి, రైతులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
