రంగా ఆశయాలకు యువత వారసులు కావాలి
- ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
- ఊటుకూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ..
- ఆశ కిరణ్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొలికపూడి
- ప్రజానాయకుడిగా రంగా సేవలు చిరస్మరణీయమన్న కొలికపూడి
- యువత సమాజ సేవలో ముందుండాలని పిలుపు
- భారీగా తరలివచ్చిన అభిమానులు, గ్రామస్తులు
గంపలగూడెం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రంగా కుమార్తె ఆశ కిరణ్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు.
రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో నిర్వహించిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజాప్రతినిధులు, సామాజిక, యువజన సంఘాల నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రంగా కుమార్తె ఆశ కిరణ్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతుడైన ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు.
ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రంగా రాజకీయ ప్రస్థానం, ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, యువతకు అందించిన స్ఫూర్తిని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ఖమ్మంలో జరిగిన రంగా చారిత్రాత్మక భారీ బహిరంగ సభ ఆయన ప్రజాదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని యువత సమాజ సేవలో ముందుండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం అభిమానులు రంగా విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
