ప్రధాని మోదీకి బెదిరింపులు… రంగంలోకి దిగిన ఫెడరల్ పోలీసులు
- ఆస్ట్రేలియా పర్యటనకు ముందు
- మెల్బోర్న్ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు..
- దర్యాప్తు ప్రారంభించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆన్లైన్లో బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. జూలై 9న మెల్బోర్న్లో జరగనున్న “మెల్బోర్న్ మీట్స్ మోదీ” కమ్యూనిటీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హెచ్చరికలు రావడంతో ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఆస్ట్రేలియాకు చెందిన ‘ది ఆస్ట్రేలియా టుడే’ కథనం ప్రకారం, ఫేస్బుక్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టు కింద “అబూ ముస్తఫా” పేరుతో ఉన్న ఓ ఖాతా నుంచి ప్రధాని మోదీ ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యాఖ్యలు పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలను అత్యంత తీవ్రంగా పరిగణించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం వెంటనే దర్యాప్తు ప్రారంభించింది.
భద్రత కట్టుదిట్టం
ఈ బెదిరింపులపై ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ (AFP)తో పాటు భద్రతా, నిఘా సంస్థలు విచారణ ప్రారంభించాయి. బెదిరింపు సందేశాల డిజిటల్ ఆధారాలను పరిశీలించి, వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్‌ను గుర్తించినట్లు సమాచారం. ఈ సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు అక్కడి భారతీయ సమాజం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులు, ఫెడరల్ భద్రతా సంస్థలు సంయుక్తంగా కార్యక్రమ స్థలాన్ని సమీక్షించి అదనపు భద్రతను ఏర్పాటు చేశాయి. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు. ఈ బెదిరింపులపై దర్యాప్తు కొనసాగుతోంది. బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థల గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి తుది నిర్ధారణ వెలువడలేదు.
