ENG vs IND 2nd T20 | బెతెల్ మెరుపులు.. శ్రేయస్‌కు మళ్లీ షాక్..

  • ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
  • భారత్‌పై ఇంగ్లండ్ 4 వికెట్ల విజయం
  • 1-0 ఆధిక్యంలో ఇంగ్లండ్

ఆంధ్రప్రభ, క్రీడా విభాగం : ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆతిథ్య జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

మరోవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియాకు తొలి విజయం కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో భార‌త్ వైట్ వాష్ అయ్యింది. ఇక‌ ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.

191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే స్టార్ ఓపెనర్లు జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ ఖాతా కూడా తెరవకుండానే అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో పడింది. భార‌త్ మంచి ఫామ్ లో ఉంది అనుకునే లోపే.. హ్యారీ బ్రూక్ ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. కానీ అతని దూకుడు ఎక్కువసేపు కొనసాగలేదు. 51 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ పవర్‌ప్లేలోనే కష్టాల్లో పడింది.

ఈ దశలో జాకబ్ బెతెల్ అసాధారణ బ్యాటింగ్ తో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. టామ్ బాంటన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి బెతెల్ 33 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఆ తర్వాత జాకబ్ బెతెల్ గేర్ మార్చి చెల‌రేగాడు. వరుణ్ చక్రవర్తి ఓవర్లో రెండు బౌండరీలు బాదిన బెతెల్.. మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పిన 17వ ఓవర్లో రవి బిష్ణోయ్‌పై విరుచుకుపడ్డాడు. రన్‌అప్‌లో తప్పిదాలతో బిష్ణోయ్ మూడు నోబాల్స్ వేయగా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బెతెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్‌తో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ వైపు తిరిగిపోయింది.

ఇక 19వ‌ ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ఖాయం చేశారు. భారత్‌కు మంచి స్కోర్ ఉన్నప్పటికీ, బౌలర్లు కీలక సమయంలో మ్యాచ్‌పై పట్టును నిలబెట్టుకోలేకపోయారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో బెతెల్‌ను నియంత్రించడంలో విఫలమవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.