ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు..

  • దేశానికే ఆద‌ర్శంగా ఇందిర‌మ్మ ఇళ్ల పథకం
  • పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వ ప్రణాళికలు
  • క్యూర్ ప‌రిధిలో అర్భ‌న్ హౌసింగ్ కు అత్యంత ప్రాధాన్య‌త..
  • రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
  • సోలార్ సదుపాయాలతో ఆధునిక భవనాలు..

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, ఇదే తరహాలో పట్టణ పేదల కోసం కూడా అఫోర్డబుల్ హౌసింగ్‌ను వేగంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం క్యూర్ (CORE Urban Region) పరిధిలో చేపట్టనున్న అఫోర్డబుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్ స్కీమ్, అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణం అంశాలపై హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలులో మరింత వేగం తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో క్యూర్ పరిధిలో పట్టణ పేదల కోసం అఫోర్డబుల్ ఎల్ఐజీ హౌసింగ్ పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. మొదటి దశలో క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన టెండర్లను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదే సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా మంత్రి సమీక్ష నిర్వహించారు. 10 ఆర్డీవో కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన 2 డీఐజీ కార్యాలయాలు, 4 జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ భవనాలన్నింటినీ ఒకే నమూనాలో, ఆధునిక సౌకర్యాలతో, ప్రజలకు మరింత అనుకూలంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సోలార్ పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.