July 05 Sunday 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

సంజీవని పర్వతం సగభాగం పడిన పవిత్ర నేల… అర్ధగిరి

వ్యాధులను నయం చేసే సంజీవరాయ తీర్థం…

విజయాలను ప్రసాదించే వీరాంజనేయుడు

యాదమరి సభలో అర్ధగిరి మహత్యాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, శ్రీశైలం, సింహాచలం, కాణిపాకం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి అందరికీ తెలుసు. అయితే పురాణ ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక మహిమ, ప్రకృతి సౌందర్యం, ఆరోగ్య రహస్యాలు అన్నీ ఒకేచోట కలిసిన కొన్ని అరుదైన క్షేత్రాలు మాత్రం ఇప్పటికీ మరుగునే ఉన్నాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయం ఒకటి.

పచ్చని కొండల మధ్య ప్రకృతి ఒడిలో వెలసిన ఈ పవిత్ర క్షేత్రం, రామాయణ గాథతో ముడిపడి ఉండటమే కాకుండా వేలాది మంది భక్తుల విశ్వాసాలకు కేంద్రబిందువుగా నిలిచింది. ఇక్కడి సంజీవరాయ తీర్థానికి ఉన్న ఔషధ గుణాలు, స్వామివారి మహిమలు, పౌర్ణమి వేళ జరిగే విశేష పూజలు ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

ఇటీవల యాదమరి మండలంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం అర్ధగిరి క్షేత్ర విశిష్టతను ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఈ క్షేత్రంపై దృష్టిని కేంద్రీకరించింది.

రామాయణ గాథలో పుట్టిన అర్ధగిరి

అర్ధగిరి చరిత్రను పరిశీలిస్తే అది నేరుగా రామాయణ కాలానికి చేరుకుంటుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, రావణాసురుడి మధ్య జరిగిన మహాయుద్ధంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తివంతమైన ఆయుధానికి మూర్ఛపోతాడు. లక్ష్మణుడిని రక్షించేందుకు సంజీవని అనే దివ్య ఔషధం అవసరమని తెలిసిన వెంటనే హనుమంతుడు హిమాలయాలకు బయలుదేరుతాడు.

ద్రోణగిరి పర్వతానికి చేరుకున్న హనుమంతుడు సంజీవని మొక్కను గుర్తించలేకపోవడంతో మొత్తం పర్వతాన్నే పెకిలించి తన అరచేతిపై మోసుకుంటూ లంక వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో పర్వతంలోని ఒక భాగం భూమిపై పడిపోతుంది. ఆ “అర కొండ” పడిన ప్రదేశమే నేటి అర్ధగిరి అని స్థల పురాణం చెబుతోంది.

“అర కొండ” అనే పదం కాలక్రమేణా “అరగొండ”గా మారిందని స్థానికులు చెబుతారు. నేటికీ అర్ధగిరి పక్కనే ఉన్న అరగొండ గ్రామం ఈ పురాణ గాథకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.

ముఖ్యమంత్రి ప్రస్తావనతో మళ్లీ వెలుగులోకి

ఇటీవల యాదమరి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధగిరి విశిష్టతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రామాయణ కాలంలో హనుమంతుడు తీసుకువెళ్తున్న సంజీవని పర్వతం నుంచి ఒక భాగం ఈ ప్రాంతంలో పడిందని, అందుకే దీనిని అర్ధగిరిగా పిలుస్తున్నారని ఆయన వివరించారు.

అలాగే అర్ధగిరిలోని పుష్కరిణి జలాలకు విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయని, అనేక మంది భక్తులు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో ఇలాంటి క్షేత్రాల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

సంజీవరాయ తీర్థం… విశ్వాసానికి ప్రతీక

అర్ధగిరి క్షేత్రంలో అత్యంత ప్రధాన ఆకర్షణ సంజీవరాయ పుష్కరిణి. సంజీవని పర్వతంలోని దివ్య ఔషధ మూలికల ప్రభావం ఈ నీటిలో కలిసిపోయిందని భక్తుల విశ్వాసం.

పుష్కరిణి నీరు భూమిలోని సహజ వనమూలికలను తాకుతూ ప్రవహిస్తుందని, అందువల్ల ఈ నీటికి ప్రత్యేకమైన ఔషధ గుణాలు లభించాయని స్థానికులు చెబుతారు. టిబి, ఆస్తమా, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, శ్వాస సంబంధిత సమస్యలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఈ తీర్థం ఉపశమనం కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు.

ప్రతి రోజు వందలాది మంది భక్తులు తీర్థాన్ని సేవించి స్వామివారిని దర్శించుకుంటారు. కొందరు 40 రోజులపాటు తీర్థాన్ని సేవించి ప్రత్యేక వ్రతాలు కూడా ఆచరిస్తుంటారు.

ఔషధ గుణాలున్న కొండ మట్టి

పుష్కరిణి నీటితో పాటు అర్ధగిరి కొండ మట్టికి కూడా విశేష ప్రాధాన్యం ఉంది. కొండపై లభించే మట్టిలో అనేక ఔషధ మూలికల ప్రభావం ఉందని స్థానిక విశ్వాసం. ఈ మట్టిని శరీరానికి రాసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయని భక్తులు చెబుతుంటారు.

శాస్త్రీయంగా నిర్ధారణ కానప్పటికీ, తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశ్వాసం అర్ధగిరి క్షేత్ర ప్రత్యేకతల్లో ఒకటిగా నిలిచింది.

ఉత్తరాభిముఖంగా దర్శనమిచ్చే హనుమ

భారతదేశంలోని చాలా హనుమాన్ ఆలయాల్లో స్వామివారు తూర్పు లేదా దక్షిణాభిముఖంగా ఉంటారు. అయితే అర్ధగిరిలో మాత్రం స్వామివారు ఉత్తరాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం.

స్థల పురాణం ప్రకారం సప్తర్షులలో ఒకరైన కశ్యప మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఉత్తర దిక్కు కుబేరుని దిక్కుగా భావించబడటంతో ఈ స్వామిని దర్శిస్తే ఐశ్వర్యం, విజయాలు, శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

విజయాలకు నాంది పలికే క్షేత్రం

అర్ధగిరి స్వామివారిని దర్శించుకుని కొత్త పనులు ప్రారంభిస్తే విజయవంతమవుతాయని భక్తుల విశ్వాసం. ఉద్యోగం, వ్యాపారం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి ముఖ్య కార్యక్రమాలకు ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది.

చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

పౌర్ణమి రోజున భక్తుల సందడి

అర్ధగిరి క్షేత్రంలో ప్రతి పౌర్ణమి రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చంద్ర కిరణాలు సంజీవరాయ తీర్థంపై ప్రసరించే ఈ రోజున తీర్థ మహిమ మరింత పెరుగుతుందని భక్తులు నమ్ముతారు.

ఉదయం సుదర్శన హోమం, మహాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. సాయంత్రం ప్రాకారోత్సవం, ఆకుపూజ, వడమాల సేవ, భజనలు, హరికథలు నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివస్తారు.

తొమ్మిది పౌర్ణములు వరుసగా ఈ క్షేత్రాన్ని సందర్శించి తీర్థాన్ని సేవిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చాలామంది విశ్వసిస్తారు.

చోళుల కాలం నాటి నిర్మాణం

స్థల పురాణం త్రేతాయుగాన్ని సూచించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం చోళ రాజుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ, చారిత్రక ఆనవాళ్లు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఆలయ పరిసరాల్లో అనేక గుహలు కనిపిస్తాయి. ఈ గుహల్లో యోగులు, మహర్షులు తపస్సు చేశారనే కథనాలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.

ప్రకృతి, భక్తి, ఆరోగ్యం కలిసిన ఆధ్యాత్మిక నిలయం

అర్ధగిరి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. అది భక్తి, విశ్వాసం, ప్రకృతి, పురాణం, ఆరోగ్య సంప్రదాయాల సమ్మేళనం. కొండల మధ్య వీచే చల్లని గాలులు, పక్షుల కిలకిలారావాలు, పుష్కరిణి ప్రశాంతత, స్వామివారి దివ్య సన్నిధి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి.

ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వెతుకుతున్నవారికి, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి, పురాణ గాథలపై ఆసక్తి ఉన్నవారికి అర్ధగిరి ఒక అద్భుత అనుభూతిని అందించే క్షేత్రంగా నిలుస్తోంది.

సంజీవని శక్తిని తనలో దాచుకున్న ఈ పవిత్ర భూమి నేటికీ భక్తుల విశ్వాసాలను నిలబెడుతూ, “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగుతోంది. అర్ధగిరి వీరాంజనేయుని దర్శించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు చేకూరాలని భక్తులు విశ్వసిస్తున్నారు.

సాటి గంగాధర్, చిత్తూరు బ్యూరో.


పొగడ్త మైక్ లో.. విమర్శ చెవిలో

ఈ మధ్య మనం మీడియా ఛానెల్స్ లో చూస్తున్నాం కదా సినిమా నటులు, దర్శకులు అదే ఫీల్డ్ లో ఉన్న మిగతా ఆర్టిస్టుల గురించి చాలా హీనంగా బూతులతో మాట్లాడటం. అయితే అలా వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇక ట్రోలింగ్ మొదలవుతుంది. అలాగే వాళ్ళు ఎవరిని విమర్శించారో ఆ వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి తమని విమర్శించిన వ్యక్తుల మీద విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఛానెల్స్ కు పండగే పండగ. ఆ వీడియో క్లిప్స్ ను పదే పదే ప్రసారం చేస్తూ వ్యూస్ పెంచుకుంటున్నారు. జనాలకు వినోదాన్ని పంచుతున్నారు.కొన్నాళ్ళకి మళ్ళీ ఏదో కొత్త వివాదం వస్తే దాన్ని వైరల్ చేస్తూ ఈ పాత వివాదాన్ని మరచిపోతున్నారు.

అయితే ..ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నది ఈ విషయం కాదు. ఒక ప్రముఖుడు ఇంకో ప్రముఖుడికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయినపుడు అతడు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆ విషయాన్ని పబ్లిక్ లో ఈ ప్రముఖుడు చెప్పకూడదు అతడు అతనికి ఎంత దగ్గరవాడు అయినా సరే.ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్ అయి ఉండవచ్చు , ప్రైవేట్ సంభాషణ లో ఎలా అయినా మాట్లాడుకోవచ్చు.కానీ వారి సంబంధం జనాలకు తెలీదు కదా.ఒకవేళ తెలిసినా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా మీడియాలో గేలి చేస్తూ ఉంటారు కదా.

ఈ మధ్య ఒక పెద్ద నటుడు ఇంకో చిన్న నటుడుని నోటికొచ్చిన బూతులతో తిట్టాడు ఒక పబ్లిక్ ఫంక్షన్ లో. నా ఫ్రెండే కదా అనుకున్నాడు.కానీ జనాలు అలా అనుకోలేదు. బూతులు తిట్టిన నటుడికి సంస్కారం లేదు అనుకున్నారు. అలాగే రచయితలు కూడా తోటి నటులమీద పబ్లిగ్గా నోరు జారుతుంటారు వారి మధ్య ఉన్న క్లోజ్ నెస్ వల్ల.కానీ జనాలు చిన్నస్థాయి లో ఉన్న రచయితలనే తప్పు బట్టారు. కాబట్టి …ఒక ప్రముఖుడు మనకు ఎంత బాగా తెలిసినా అతన్ని పబ్లిగ్గా విమర్శించవద్దు ఎప్పుడూ.ఏదైనా ఉంటే పెర్సనల్ గా అతని చెవిలో వేయడం బెటర్. అందుకే పొగడ్త మైక్ లో చెప్పాలి..విమర్శ చెవిలో చెప్పాలి అంటారు .. అంతే కదా ఫ్రెండ్స్ !!!

ఎరవాడ పంచలకు 400 ఏళ్ల చరిత్ర

తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానం తరపున స్వామి వారికి జోడు పంచలను భక్తి తో సమర్పించే సంప్రదాయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికీ ఆ సంస్థానం తరపున దీక్ష గా వస్త్రాలను మగ్గం పై నేసి తీసుకువచ్చి సమర్పించే ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత చీరలకు ప్రసిద్ధి గాంచిన గద్వాల ప్రాంతం కాకతీయుల, విజయనగర పాలకుల ఏలుబడి నుంచి విడివడి 1663 లో స్వతంత్ర సంస్థానంగా ఏర్పడింది. ఈ సంస్థానాన్ని పాలించిన నల సోమనాధ భూపాల్ విష్ణు భక్తితో తమ కోటలోనే చెన్నకేశవస్వామి గుడిని నిర్మించి పూజలు చేసేవారు. అదే భక్తితో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని తరచుగా దర్శించుకునే వారు. గద్వాల కున్న చేనేత వస్త్ర చరిత్రకు ఆధ్యాత్మికత జోడించే విధంగా ఏటా స్వామి మూలమూర్తి కి రెండు పంచలను నేయించి పంపే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆ సంప్రదాయం ప్రకారం గద్వాలకు చెందిన చేనేత రంగ నిపుణులు భక్తి శ్రద్దలతో ప్రతి ఏటా శ్రావణ మాసం మొదలయ్యే 25 రోజుల ముందు వస్త్రాన్ని నేయడం మొదలు పెడ్తారు ఆ సందర్భంగా అత్యంత నిష్ఠ గా ఉంటూ గోవింద నామాన్ని జపిస్తూ నేత పని చేస్తారు . 11 గజాల పొడవు, 3 గజాల వెడల్పు ఉండే ఆ పాంచాల అంచుపై 8 అంగుళాల వెడల్పైన కోట బురుజుల డిజైన్ ఉంటుంది. ప్రతి ఏటా తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరిగే రోజున సంస్థానం ప్రతినిధులు ఆ రాజ వంశీకుల తరపున ఒక లేఖ ను, ఎరవాడ జోడు పంచలను తిరుమలకు తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేస్తారు. ఆలయ అర్చకులు ఆ పంచలను స్వామి వారి మూలమూర్తి కి ధోవతిగా ధరింపచేస్తారు అంతకుముందు స్వామి వారికి అలంకరించిన ధోవతులను పవిత్ర శేషవస్త్ర బహుమానంగా ఆ ప్రతినిధులు సంస్థానానికి తీసుకువెళతారు ఇప్పటికీ గద్వాల లోని లింగంబాగ్ కాలనీ లోని మహంకాళి కరుణాకర్ ఇంటి పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మగ్గం పై ఏటా ఈ ఎరవాడ పంచలను నేసి స్వామికి సమర్పించే కార్యక్రమం జరుగుతోంది.

ఓం నమో వేంకటేశాయ.

కోపం, బాధ, బాధ్యత, ప్రతీకారం!

పసివాడుగా పుట్టాం. ఇక యుద్ధం మొదలు. తిండి నుంచి excretion process వరకు, శక్తిని పొందాలన్నా, చెత్తను బయటకు తోయాలన్నా పని చేయాలి.

ఉద్రేకం, ఉత్సాహం, ఒకటి శక్తి ఖర్చుపెడుతుంది. ఇంకోటి శక్తిని ఇస్తుంది. మనలో ఉత్సాహం పోవడానికి ప్రతీ పరిస్తితి, ప్రతీ సన్నాసీ పని గట్టుకుని పాటు పడతారు.

ఎందుకంటే వారి ఆనందం కన్నా, పక్కవాడి బాధ వారికి సంతోషం. Sadism. కోపం : – కోపానికి మేత అహంకారం. అధికారాన్ని కోరుకుంటుంది అహంకారం..తన మాటే నెగ్గాలి. అందరూ తన మాట వినాలి. నాకే అన్నీ తెలుసు. నా అంత నిజాయితీ పరులు ఈ భూమి మీద లేరు.

నా అంత మేధావి ఎవరూ లేరు. నేనే గొప్ప. నాకు నేనే అన్నీ. అలా మనం అనుకుని అందరూ అనుకోవాలి అని కోరుకుంటాం. తనని తప్పు అని ఎవరూ అనకూడదు. ఇలా అనుకుంటూ పునాదులు లేని అద్దాల మేడలు మనుషులు కట్టుకుంటారు. ఎవరు చిన్న రాయితో కొట్టినా ఒక్కో అంతస్తు కూలిపోతుంది. ఇక కోపం మొదలు.. రక్తం గోదావరి వరద అయ్యి ప్రవహిస్తుంది.

నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల తూటాలు బాణాలు అటూ ఇటూ మారతాయి. గుండెల్ని సూదులతో గుచ్చుకుంటాం. గాయాలు అయ్యి ఇల్లు, రోడ్డు, గదులు, శరీరాలు తడుస్తాయి! తన కోపమే తన శత్రువు పద్యం వెయ్యి సార్లు చదివాం, విన్నాం అయినా గుర్తు రాదు. మనుషులు శత్రువుల్లా మారిపోతున్నాం.

తర్వాత ఇంకా జీవితం ఉంటుంది, అదే ఊర్లో, అదే మనుషులతో. జీవం లేని నవ్వులు, నమ్మకం లేని మాటలు…, మనుషుల మధ్య సముద్రాల దూరం ఏర్పడుతుంది. కోపం ఎదుటి వారికి చేసే హాని కన్నా, ఆ కోపానికి ఇల్లు ఇచ్చిన మన శరీరం, ఆత్మ, మనస్సు ఎక్కువ నష్టపోతాయి. నిర్మాణాత్మకమైన ఆగ్రహం కార్య సాధన వైపుకు నడిపిస్తుంది! మౌనం, శాంతి, క్షమ, పరోపకారం…ఈ సాధనలో ప్రేమ సామ్రాజ్యం సాధ్యం. మన ప్రయత్నాలు అటే ఉండాలి.

బాధ : – బాధే సౌఖ్యమనే భావన రాణీవోయి, ఆ ఎరుకే నిశ్చలాందమోయి! దేవదాసు పాట విన్నాం. సముద్రాలు గారు రాశారో, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారో! గొప్ప బాట. గొప్ప మాట. కుడి ఎడమైతే పొరపాటు లేదోయి. ఏం జరిగినా మన మంచికే. నిజం. కానీ దానిని ప్రతీ దానికి అన్వయించి, Generalized attribution చేసి, పలాయనం, పారిపోవడం చేయకూడదు. జీవితంలో 70 శాతం సంఘటనలు మన ఆధీనంలో ఉండవు.

నువ్వు ఎంత ఎక్కువ కంట్రోల్ చేయగలిగితే అంత విజయం. జీవితంలో జరగరానివి జరిగినప్పుడు మనుషులు ఆందోళనతో, బాధతో విస్పోటనం చెందకుండా ఉండడానికి, స్వాంతన కోసం ఆ మాట, ఏం జరిగినా మంచికే అంటూ. జీవితం మళ్ళీ నిర్మించుకోవాలి. జరిగిన గతం దానిని మార్చలేము. పాఠం నేర్చుకుని, జాగ్రత పడి, మళ్ళీ పాత తప్పులు చేయకుండా జీవితం కొనసాగించు అని చెప్పే మాట అది.

దొర వారి గడీల్లో నలిగిపోయిన న్యాయం, బలవంతుల దౌర్జన్యాలు…., ప్రజలు, మానవ జాతి ఎంతో బాధ పడింది. పేదవాళ్ళు, బలహీన వర్గాలు నలిగిపోయాయి. అలాంటి సామూహిక బాధలు, తిరుగుబాటు, ధర్మ పోరాటం వైపు నడుస్తాయి. దానికి మద్దతు తెలుపడం అంటే సమాజ హితం. అప్పుడు కూడా గోడ మీద పిల్లుల్లా ఉండేవారు దేశద్రోహులు. బాధ్యత, ప్రతీకారం, కామ, క్రోధ, లోభ, మోహ, …, వచ్చే వారాల్లో మాట్లాడుకుందాం. జీవితాల్లో మనం ఎన్నో వాటికి ఇడుపు కాయితాలు ఇవ్వాలి. జీవితం అంటే నిరంతరం నేర్చుకోవడం.

లోకా సమస్థాస్సుఖినోభవంతు.