కేసముద్రం మెడికల్ షాప్స్ బందు విజయవంతం

కేసముద్రం మెడికల్ షాప్స్ బందు విజయవంతం

మెడికల్ షాప్ అసోసియేషన్ బాధ్యులు వోలం శ్రీనివాస్

కేసముద్రం, మే 20 (ఆంధ్రప్రభ):
ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపులో భాగంగా కేసముద్రం మెడికల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బందు విజయవంతం అయిందని ఆ సంఘం బాధ్యులు వోలం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా మెడికల్ షాపుల యజమానులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఒకవైపు షాపుల కిరాయిలు, విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు, మెడిసిన్స్ కొనుగోలు ఖర్చులు రోజురోజుకు పెరుగుతుండగా, మరోవైపు కార్పొరేట్ మెడికల్ షాపులు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ చిన్న మెడికల్ షాపుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు.

ప్రత్యేకంగా ఆన్‌లైన్ మెడిసిన్స్ డోర్ డెలివరీ విధానం కారణంగా గ్రామీణ, అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో చిన్న మెడికల్ షాపులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు కోట్ల రూపాయల పెట్టుబడులతో మార్కెట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటూ చిన్న వ్యాపారులను పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాయని విమర్శించారు.

సాధారణ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే చిన్న మెడికల్ షాపులే అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్నాయని, అలాంటి షాపులను ప్రభుత్వం రక్షించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు.

ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలపై కఠిన నియంత్రణలు విధించాలని, చిన్న మెడికల్ షాపులకు రక్షణ కల్పించే విధానాలు తీసుకురావాలని, కార్పొరేట్ మెడికల్ చైన్ల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా శ్రీనివాస్ కోరారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు హసీమ్ అలీ, అలీ బాబా, భాస్కర్ రెడ్డి, వేణు, రాము, ఏకాంతం, ఎల్లయ్య, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.