ఆశా వర్కర్లకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి
ఆశా వర్కర్లకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ:
ఎన్నికల ముందు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు పూనుకుంటామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు హెచ్చరించారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్లు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో, వారి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సెక్రటరీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్. శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, తాము అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తలకు నెలకు రూ. 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా వేతనాలు పెంచకుండా మాట తప్పిందని మండిపడ్డారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతూ, పోలీస్ స్టేషన్లకు తరలించడం దారుణమన్నారు. “ప్రజా పాలన – ప్రజా ప్రభుత్వం” అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
ప్రతి నెల 5వ తేదీ లోపు పారితోషికాలు అకౌంట్లలో వేస్తామని చెప్పిన ప్రభుత్వం, గత 3 నుండి 4 నెలలుగా బకాయిలను పెండింగ్లో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమానతలు లేని సమాజం గురించి మాట్లాడుతుంటారు కానీ, కిందిస్థాయి ఉద్యోగులు, కార్మికుల వేతనాల విషయంలో ఎందుకు వ్యత్యాసాలు చూపిస్తున్నారని ప్రశ్నించారు.
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసి మరణించిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఇన్సూరెన్స్ అందించలేదని దుయ్యబట్టారు. పైస్థాయి ఉద్యోగుల వలే ఆశాలకు కూడా హెల్త్ కార్డులు, జీవిత బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం, గ్రాట్యుటీ, 180 రోజుల ప్రసూతి సెలవులు అమలు చేస్తున్నప్పుడు.. తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
