‘సైమ’ ఎన్‌ఆర్ఐ సెల్ అధ్యక్షురాలిగా గోలి నవ్య రెడ్డి నియామకం

‘సైమ’ ఎన్‌ఆర్ఐ సెల్ అధ్యక్షురాలిగా గోలి నవ్య రెడ్డి నియామకం
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ: సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సైమ) అంతర్జాతీయ ఎన్‌ఆర్ఐ సెల్ అధ్యక్షురాలిగా అట్లాంటాకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయురాలు, తెలంగాణలోని నల్లగొండ జిల్లా వాస్తవ్యులు గోలి నవ్య రెడ్డి నియమితులయ్యారు. అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆదివారం ఘనంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ‘సైమ’ ఫౌండర్ ప్రెసిడెంట్ నకిరేకంటి స్వామి ఆమెకు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ నకిరేకంటి స్వామి మాట్లాడుతూ.. ‘సైమ’ కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఎన్‌ఆర్ఐ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నవ్య రెడ్డి నేతృత్వంలో ఈ విభాగం అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం అవుతుందని, ఆమె తన వృత్తిపరమైన అనుభవంతో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు గోలి నవ్య రెడ్డి ‘సైమ’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌత్ ఇండియన్ మీడియా ప్రతినిధులను, ప్రవాస భారతీయులను ఒకే తాటిపైకి తెస్తూ అసోసియేషన్ ఆశయాల సాధనకు శరవేగంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని పలువురు ప్రవాస భారతీయులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొని నవ్య రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
