తడిసిన ప్రతి గింజకు మద్దతు ధర ఇవ్వాలి

తడిసిన ప్రతి గింజకు మద్దతు ధర ఇవ్వాలి
- దళారీల దోపిడీ ఆపాలి
- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, ఆంధ్రప్రభ ; అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అచ్చంపేట మార్కెట్ యార్డులో తడిసిన ప్రతి ధాన్యపు గింజనూ మద్దతు ధరకే కొనుగోలు చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి, వర్షానికి తడిసిపోయిన ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మార్కెట్ యార్డులో వందలాది క్వింటాళ్ల ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కాకుండా నిలిచిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని విమర్శించారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో రైతుల కష్టార్జితం వర్షార్పణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మార్కెట్ యార్డుల్లో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తూ అన్నదాతలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు దళారీల చేతిలో మోసపోతుంటే ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రైతులకు భోజనం సహా అన్ని వసతులు కల్పించామని గుర్తుచేసిన గువ్వల బాలరాజు.. ప్రస్తుతం నెల రోజులుగా మార్కెట్ యార్డులోనే ఉంటున్న రైతులకు కనీస తాగునీటి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించలేకపోయిందని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లు చేశారు. మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, అకాల వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్నీ నిబంధనలు సడలించి మద్దతు ధరకే కొనాలని కోరారు. ధాన్యం తరలింపునకు అవసరమైన లారీలు, గన్నీ బ్యాగులను యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేసి రైతులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే అన్నదాతల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గువ్వల బాలరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రేనయ్య, నాయకులు మంగ్యా నాయక్, మండికారి బాలాజీ, జానకి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, శంకర్ మాదిగ, వెంకటేష్, రంగినేని రవీందర్, చందూలాల్, శివచంద్ర గౌడ్, బయ్యా రాజు, మధు తదితరులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
