కొల్లాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్
కొల్లాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్
పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక సమీక్ష
లబ్ధిదారులు, పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా మాట్లాడిన హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, (ఆంధ్రప్రభ): కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పర్యటనలో భాగంగా ముందుగా పట్టణ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్, విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, పని వాతావరణం, సంక్షేమ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు, గ్లోవ్స్, మాస్కులు, రక్షణ దుస్తులు అందుబాటులో ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు.
విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, సిబ్బంది కొరత, పరికరాల లభ్యత వంటి అంశాలపై కార్మికుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారి భద్రత విషయంలో రాజీ పడొద్దని మున్సిపల్ అధికారులకు సూచించారు.
అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులు నాగమణి, వెంకట లక్ష్మయ్య, మౌనిక, శ్రీనివాస్‌లతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ పురోగతి, ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతున్న తీరుపై ఆరా తీశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా సందర్శించిన కలెక్టర్, దుకాణాల వినియోగం, ఆదాయ వనరులు, నిర్వహణ వ్యవస్థపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి ఆదాయం పెరిగేలా వాణిజ్య స్థలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
