ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
-మంత్రి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ
ధర్మపురి, ఆంధ్రప్రభ:
తాము ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి మండల ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తమైంది. ధర్మపురిలోని రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి వ్యక్తిగత సహాయకులు (PA) సంగి సాయికి ఆశా వర్కర్లు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆత్మకూరి లత, జిల్లా నాయకురాలు మామిడిపల్లి జ్యోతి మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు చేరవేయడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నా, తమ శ్రమకు తగ్గ గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు ఫిక్స్డ్ వేతనం (స్థిర జీతం) ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కనీస ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఆశా వర్కర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, గతంలో తాము విధులు నిర్వహించిన పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీలకు సంబంధించిన అలవెన్స్ డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు సునంద, సమత, లత, యశోద తదితరులు పాల్గొన్నారు.
