మహబూబ్‌నగర్‌లో ఏటీఎం చోరీ కలకలం…

మహబూబ్‌నగర్‌లో ఏటీఎం చోరీ కలకలం…
- సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు దోపిడీ
మహబూబ్‌నగర్,క్రైం, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున దొంగల ముఠా ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంను పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు.

ఉదయం ఘటన వెలుగులోకి రావడంతో బ్యాంకు అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల షాద్‌నగర్‌లో జరిగిన ఏటీఎం చోరీ ఘటనకు పాల్పడిన ముఠాయే ఈ దోపిడీకి కూడా కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు క్లూస్ టీం సహకారంతో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డునే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పట్టణంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
