వడ్ల బస్తాలను సీరియల్ వారిగా గోదామునకు తరలించండి
వడ్ల బస్తాలను సీరియల్ వారిగా గోదామునకు తరలించండి
ఐకేపీ సిబ్బందికి అదనపు కలెక్టర్ ఆదేశాలు.
రెండు గంటల పాటు అదనపు కలెక్టర్ చంద్రయ్య పర్యటన.
దండేపల్లి, ఆంధ్రప్రభ :మండుటెండను సైతం లెక్క చేయకుండా రైతుల కోసం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య ,శనివారం దండేపల్లి మండలంలోని కన్నెపల్లి, గూడెం, నంబాల, వెల్గనూరు గ్రామ పంచాయతీల పరిధిలలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలను దాదాపు 2 గంటల పాటు తనిఖీ చేశారు.ఆయా కేంద్రాల్లో వడ్ల బస్తాలను సరియైన రీతిలో నింపుతున్నారా? తూకం నిబంధనల మేరకు వేస్తున్నారా? వడ్ల బస్తాల తరలింపునకు అవసరమైన సంఖ్యలో లారీలు వస్తున్నాయా? గోనె సంచుల లభ్యత సరిపోయిన రీతిలో ఉన్నదా? అన్న విషయాలను సంబంధిత అధికారులు, రైతులు, వడ్ల కేంద్రం నిర్వాహకుల నుండి ఆరా తీశారు.వెల్గనూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో మొదట వచ్చిన వారి వడ్లను కాకుండా, అలస్యంగా వచ్చినా సరే.తమకు తెలిసిన వారు లేదా బంధువుల అలాంటి వారి వడ్లను ముందుగా కాంట తూకం వేసి,సెంటర్ నిర్వాహకులు లారీలలోకి ఎక్కిస్తున్నారని రైతులు ఫిర్యాదు చెయ్యగా.
ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా తీసుకొని ఇలాంటి వాటిని సహించేది లేదని, సీరియల్ నెంబర్ ప్రకారమే వడ్లను తూకం వేసి,తూకం వేసిన బస్తాలను మాత్రమే లారీల లోకి ఎక్కించాలని ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో సెంటర్ నిర్వాహకులపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నంబాల గ్రామ పరిధిలో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి, అక్కడి రైతులతో, హమాలీలతో మాట్లాడి వడ్ల బస్తాలను వెంట వెంటనే లింగాపూర్ లో ప్రత్యేకంగా నెలకొల్పిన గోదాము నకు తరలించాలని ఆదేశించారు.ఎలాంటి అవకతవకలు జరగకుండా మండలంలోని వివిధ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్ల బస్తాలను గోదాములకు ఎప్పటికి అప్పుడు లారీల ద్వారా తరలించాలని స్థానిక ఐకేపీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తగినంత మంది హమాలీలను పనిలోకి తీసుకొని, వడ్ల బస్తాల తరలింపును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లారీలు తగినన్ని రావడం లేదని స్థానిక ఐకేపీ కేంద్ర నిర్వాహకులు, రైతులు ఫిర్యాదు చేయగానే,గ్రామంలో ఉన్న సంబంధిత కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి రోజుకు కనీసం 50 లారీలు తగ్గకుండా దండేపల్లి మండలం లోని వడ్ల కేంద్రాలకు పంపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే ఎంపీడీవో ప్రసాద్,ఎపియం తోట లక్ష్మీ ,ఐకేపీ సిబ్బంది ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
