TG | రోడ్డు నిబంధనలు పాటించకపోతే కుటుంబాలే బలి

TG | రోడ్డు నిబంధనలు పాటించకపోతే కుటుంబాలే బలి

  • ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్

TG | ఖానాపూర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : వాహన చోదకులు రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వల్ల ఆయా కుటుంబాలు బలి అవుతున్నాయని ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ అన్నారు. ఈ రోజు మండలంలోని గోసంపల్లి గ్రామంలో ఖానాపూర్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాహుల్ గైక్వాడ్ మాట్లాడుతూ… రోడ్డు నిబంధనలను పాటించకపోవడం వల్ల అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం బాధగా మారుతుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా రక్షణ కవచం ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు భద్రతా పట్టీ వినియోగించాలని సూచించారు.

మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం తీవ్రమైన నేరమని, అలా చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వయస్సు రాని పిల్లలు వాహనాలు నడిపితే వారి ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. రోడ్డు భద్రత అనేది చట్టపరమైన అంశం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, యువత ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్‌ సీఐ అజయ్ కుమార్, స్థానిక నాయకులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు హాజరయ్యారు.

Leave a Reply