ఫ్లెక్సీల తొలగింపుతో అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత
అచ్చంపేట, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పుట్టినరోజు సందర్భంగా అచ్చంపేట పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అనుమతులు లేవని పేర్కొంటూ మున్సిపాలిటీ సిబ్బంది పోలీసు బందోబస్తుతో తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పుట్టినరోజు వేడుకల కోసం ఒక్కరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికీ అనుమతి అవసరమా అని పోలీసులను ప్రశ్నించగా, ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరగలేదా? అప్పుడు తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సీఐ నాగరాజు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ ఆందోళనలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గండు శ్రీనివాస్ గౌడ్, మంగ్యా నాయక్, శంకర్ మాదిగ, ధర్మ నాయక్, మహిళా నాయకురాలు బలుమూరు జానకి తదితరులు పాల్గొన్నారు.
