Water Intake | ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి?
Water Intake | ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి?
Water Intake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రతి రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి అనే సలహా వైద్యులు చెప్పడం మనం తరచూ వింటూనే ఉంటాం..
కొంత మంది దీనిని ఆరోగ్యానికి సరైన ప్రమాణమని భావిస్తారు. మరి ఈ రెండు లీటర్ల నీటి సూత్రం అందరికీ సరిపోతుందా? వయసు, బరువు, వాతావరణ పరిస్థితులను బట్టి మన శరీరానికి కావాల్సిన నీటి అవసరం మారుతుందా..? అనే సందేహాలకు వైద్యనిపుణులు ఏం చెబుతున్నారు.. అసలు రోజూ రెండు లీటర్ల నీరు మన శరీరానికి ఎంత వరకు సరిపోతుందనే విషయం తెసుకుందామా..?
శరీరానికి నీరు ఎందుకు అవసరం?
మన శరీర బరువులో సగానికి పైగా నీరే ఉంటుంది. ఈ నీరు మన శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించడం, పోషకాలను శరీర కణాలకు చేరవేయడం, అలాగే మనం తినే ఆహారం జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు సహాయపడడం, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించడం, కీళ్లను రక్షించడం వంటి అనేక కీలక పనుల్లో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. తగినంత నీరు మన శరీరానికి అందకపోతే పనితీరు ప్రభావితమవుతుంది.
అందరికీ రెండు లీటర్ల నీరు సరిపోతాయా?
ఆరోగ్యవంతులైన వారిలో కొందరికి రోజుకు సుమారు రెండు లీటర్ల నీరు సరిపోవచ్చు. అయితే ఇది అందరికీ సరిపోతుందని చెప్పలేం. వేడి వాతావరణంలో పనిచేసేవారు. రోజూ వ్యాయామం చేసేవారు, కూలి పనులు చేసేవారు సాధారణం కంటే ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు పని చేస్తున్నప్పుడు గానీ, వ్యాయమం ద్వారామనం శరీరంలోని నీరు చెమట రూపంలో భయటకి వెళ్లిపోతుంది. అందే వీరు కనీసం రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల లీరు తాగడం మంచిది. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కూడా నీరు ఎక్కువ తాగడం అవసరం.
నీటి అవసరాన్ని మనశరీరం కనిపెట్టేదిలా..
-వయస్సు, శరీర బరువు
-వాతావరణ ఉష్ణోగ్రత
-శారీరక శ్రమ, వ్యాయామం
-జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు
-గర్భధారణ, పాలిచ్చే దశ
-కొన్ని కిడ్నీ లేదా గుండె సంబంధిత వ్యాధులు
నీరు తక్కువగా తాగితే కనిపించే లక్షణాల
శరీరంలో నీటి కొరత ఏర్పడితే ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
-తరచూ దాహం వేయడం
-నోరు ఎండిపోవడం
-తలనొప్పి
-అలసట
-తల తిరగడం
-ముదురు పసుపు రంగులో మూత్రం రావడం
-తీవ్రమైన సందర్భాల్లో గందరగోళం, బలహీనత
ఎక్కువ నీరు తాగినా ప్రమాదమే..
“ఎక్కువ నీరు తాగితే ఇంకా మంచిది” అనుకోవడం కూడా సరైంది కాదు. చాలా తక్కువ సమయంలో అధిక పరిమాణంలో నీరు తాగితే రక్తంలో సోడియం స్థాయిలు తగ్గి హైపోనాట్రీమియా అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇది అరుదుగా కనిపించినప్పటికీ, ముఖ్యంగా దీర్ఘకాలిక క్రీడల్లో పాల్గొనే వారిలో కనిపించవచ్చు.
నీరు మాత్రమే కాదు.. ఇతర ఆహారాలూ ద్రవాలే
శరీరానికి కావాల్సిన ద్రవాలు కేవలం నీటి నుంచే కాదు. పాలు, మజ్జిగ, సూప్, కొబ్బరి నీరు, టీ, కాఫీ వంటి పానీయాలతో పాటు పుచ్చకాయ, దోసకాయ, కమలా, స్ట్రాబెర్రీ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల ద్వారా కూడా శరీరానికి ద్రవాలు అందుతాయి. సాధారణంగా రోజువారీ ద్రవాల్లో కొంత భాగం ఆహారం నుంచే లభిస్తుంది.
తగినంత నీరు తాగుతున్నామో ఎలా తెలుసుకోవాలి?
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ఈ సంకేతాలు సాధారణంగా మంచి హైడ్రేషన్‌ను సూచిస్తాయి.
-తరచూ దాహం వేయకపోవడం
-మూత్రం లేత పసుపు లేదా దాదాపు పారదర్శకంగా ఉండటం
-రోజంతా ఉత్సాహంగా ఉండటం
- వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం
ప్రతి ఒక్కరూ రోజుకు కచ్చితంగా రెండు లీటర్ల నీరు తాగాల్సిందే అనే నియమం లేదు. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ, దాహం వేసినప్పుడు నీరు తాగడం, వేసవి కాలంలో లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు నీటి మోతాదును పెంచడం మంచిది. అయితే కిడ్నీ, గుండె లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తమకు ఎంత నీరు అవసరమో వైద్యుల సలహా మేరకే మాత్రమే నిర్ణయించుకోవాలి.
