నాటు సారాపై ఉక్కుపాదం

నాటు సారాపై ఉక్కుపాదం

డీసీ పి.శ్రీదేవి


కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు, నంద్యాల జిల్లాలను పూర్తిస్థాయి నాటు సారా రహిత జిల్లాలుగా నిలబెట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది. అక్రమ మద్యం తయారీ, పొరుగు రాష్ట్రాల మద్యం అక్రమ రవాణా, గంజాయి సరఫరా, మాదకద్రవ్యాల వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పి. శ్రీదేవి శుక్రవారం తన కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాల్లో అక్రమ మద్యం నిర్మూలన, మాదకద్రవ్యాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, పన్నుల వసూళ్లు, మద్యం దుకాణాల తనిఖీలు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.

నాటు సారా తయారీదారులపై కఠిన చర్యలు
ఇప్పటికే రెండు జిల్లాలను నాటు సారా రహిత జిల్లాలుగా ప్రకటించిన నేపథ్యంలో తిరిగి అక్రమ మద్యం తయారీ జరగకుండా పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని డీసీ ఆదేశించారు. నాటు సారా తయారీకి పాల్పడిన వారందరినీ బైండోవర్ చేయడంతోపాటు, తిరిగి అదే నేరాలకు పాల్పడే అవకాశమున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అక్రమ తయారీదారులకు బెల్లం విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి వారిపైనా బైండోవర్ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

పీడీ యాక్ట్ అమలుపై అభినందనలు
నాటు సారా తయారీలో మళ్లీ చురుకుగా మారేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పీడీ యాక్ట్ ప్రతిపాదనలు పంపాలని డీసీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పత్తికొండ స్టేషన్ పరిధిలోని నాటు సారా తయారీదారుడు సాతుపాటి కృష్ణ, కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కొల్లంపల్లి తండాకు చెందిన తెలుగు రామదాసుపై పీడీ యాక్ట్ అమలు చేసిన అధికారులను ఆమె అభినందించారు.

ఈ కేసుల్లో చురుకుగా వ్యవహరించిన కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి మచ్చ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ఈఎస్‌టీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్, సీఐలు చంద్రహాస్, స్వర్ణలతలను డీసీ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రత్యామ్నాయ జీవనోపాధిపై దృష్టి
నాటు సారా తయారీ మానేసిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఉందని సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. కేవలం కేసులు నమోదు చేయడం కాకుండా, అక్రమ మద్యం తయారీలో ఉన్న కుటుంబాలను స్థిరమైన ఉపాధి వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని డీసీ అభిప్రాయపడ్డారు.

పొరుగు రాష్ట్రాల మద్యం రవాణాపై నిఘా
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రత్యేక చెక్‌పోస్టులు, మొబైల్ దళాలు, రాత్రి తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.

పొరుగు రాష్ట్రాల మద్యం కేసులు, తీవ్రమైన నేరాల కేసుల్లో పెండింగ్‌లో ఉన్న దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, అరెస్టుకు మిగిలిన నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తు పూర్తైన వెంటనే కోర్టులకు చార్జ్‌షీట్లు సమర్పించాలని స్పష్టం చేశారు.

గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
జిల్లాల్లో గంజాయి సాగు, మాదకద్రవ్యాల సరఫరా అరికట్టేందుకు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామస్థాయి నిఘా, ప్రత్యేక దాడులు, రహస్య సమాచారం సేకరణ ద్వారా నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించాలని డీసీ ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న గంజాయి కేసుల్లో మేజిస్ట్రేట్ ద్వారా ఇన్వెంటరీ పూర్తి చేసి, స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ధ్వంసం చేసేందుకు డ్రగ్ డిస్పోజల్ కమిటీకి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్లు వేయాలని ఆదేశించారు.

యువతలో అవగాహన కార్యక్రమాలు
మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ ప్రభావంపై ప్రచారం చేపట్టాలని సూచించారు.

మద్యం దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు
పెండింగ్‌లో ఉన్న మద్యం దుకాణాల పర్మిట్ రూమ్ రిటైల్ ఎక్సైజ్ పన్నులను వెంటనే వసూలు చేయాలని, గడువు తేదీ దాటిన వారిపై జరిమానాలు విధించాలని డీసీ ఆదేశించారు. మద్యం దుకాణాలు, బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించాలని సూచించారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు ఈ సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రావిపాటి హనుమంతరావు, నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్. రవికుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, వి.రాముడు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన అన్ని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు.

అక్రమ మద్యం నిర్మూలనకు సమగ్ర వ్యూహం
కేవలం కేసులు నమోదు చేయడం కాకుండా, నాటు సారా తయారీకి దారితీసే మూల కారణాలపై దృష్టి పెట్టడం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం, మాదకద్రవ్యాల నియంత్రణ, సరిహద్దు నిఘా, ప్రజల్లో అవగాహన పెంపు వంటి అంశాలను సమన్వయంతో అమలు చేయడం ద్వారా కర్నూలు, నంద్యాల జిల్లాలను శాశ్వతంగా అక్రమ మద్యం రహిత జిల్లాలుగా నిలబెట్టాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమావేశం స్పష్టం చేసింది.

Leave a Reply