చిరు వ్యాపారులను ఆదుకోవాలి
చిరు వ్యాపారులను ఆదుకోవాలి
- మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శేఖర్ గౌడ్ వినతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డు సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనానికి తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చిరు వ్యాపారులకు కేటాయించాలని మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనుల కారణంగా చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, కాలుష్యం వల్ల వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్ భవనంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి త్వరగా వ్యాపారులకు అప్పగిస్తే వారికి రక్షణగా ఉంటుందన్నారు.
అదేవిధంగా ఫారెస్ట్ గేటు ముందు నుంచి వెనుక భాగం మీదిగా గ్రంథాలయం, మున్సిపల్ కార్యాలయం వరకు తాత్కాలిక రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. దీనివల్ల మార్కెట్‌కు వచ్చే ప్రజలకు రవాణా సులభతరం కావడమే కాకుండా, హైవేపై ట్రాఫిక్ రద్దీ తగ్గి వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయని వివరించారు. అధికారులు సానుకూలంగా స్పందించి ఈ పనులను త్వరితగతిన చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, గడ్డం ఇందిరా రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.
