Revanth | 182 సీట్లలో 117 గెలుస్తాం..

Revanth | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తుది విడతగా రూ.1,009 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసిన అనంతరం ప్రసంగించిన ఆయన.. 2028 డిసెంబరులో ఎన్నికలు జరగవని, 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయని అన్నారు.

రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం లోక్‌సభ స్థానాలు 25కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆ 182 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తాను గతంలో చేసిన ఎన్నికల అంచనాలు నిజమయ్యాయని గుర్తుచేసిన సీఎం.. కాంగ్రెస్‌కు 65 సీట్లు వస్తాయని చెప్పగా 64 స్థానాలు గెలిచిందని, ఉప ఎన్నికల్లో మరో రెండు స్థానాలు గెలిచి బలం పెంచుకుందని అన్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని తాను ముందే చెప్పానని, అదే జరిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై ఘాటు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. “భద్రాచలం శ్రీరాముడిపై ఆన.. ఇది కాంగ్రెస్ ప్రతిజ్ఞ. రాసిపెట్టుకోండి.. ఈరోజు చెప్పింది జరిగితీరుతుంది” అని అన్నారు. తెలంగాణ ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని, రాబోయే రాజకీయ పోరాటంలో కూడా విజయం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.