రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళి..

మక్తల్ , ఆంధ్రప్రభ : దేశంలో సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహానీయుడు దివంగత ప్రధానమంత్రిరాజీవ్ గాంధీ అని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. భారత సమాచార విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసి, యువతకు నూతన అవకాశాల దారులు తెరిచిన మహానేత రాజీవ్ గాంధీ అని అన్నారు.కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకెళ్లిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని మంత్రి కొనియాడారు. యువత శక్తిపై అపార విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని నమ్మారని గుర్తుచేశారు. 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో యువశక్తికి ప్రాధాన్యం పెంచారని మంత్రి పేర్కొన్నారు.

సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి, దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కూడా యువత అభివృద్ధి, డిజిటల్ పురోగతి, క్రీడలు, ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాగనూర్ మాజీ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, మంథన్ గోడ్ సర్పంచ్ కె.రాజేందర్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, ఫయాజ్, వాకిటి హనుమంతు, అశోక్ గౌడ్,వాకిటి శ్యామ్, నేరడగొం ఆనంద్ ,రాజప్ప గౌడ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply