Telangana Cabinet | ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

మూసీ, వర్షాభావం, రైతుల సమస్యలపై కీలక చర్చ..
సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో, పంచాయతీరాజ్ చట్ట సవరణపై నిర్ణయాలకు అవకాశం

Telangana Cabinet | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశం నేపథ్యంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై కేబినెట్ చర్చించనుంది. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్ అమలు, తాగునీటి సరఫరాపై కూడా సమీక్ష నిర్వహించనుంది. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ స్థితి, ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా వివిధ ప్రాజెక్టుల అంచనాలపై కేబినెట్ సమీక్షించనుంది. అలాగే గోదావరి–బనకచర్ల వివాదం, కృష్ణా–గోదావరి జలాల పంపిణీ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ, ఎల్‌అండ్‌టీ నుంచి ప్రాజెక్టు టేకోవర్ ప్రక్రియ, దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, కమిటీ ఏర్పాటు ఆలస్యంపై కూడా మంత్రివర్గం సమీక్షించనుంది. అదేవిధంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయడానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3) సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, కేబినెట్ సమావేశానికి ముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా నెలకు రూ.1,000 కోట్ల ఆదాయం సమీకరించే ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు.