కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం..
- ‘జగనన్న 2.0’తో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం..
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
- జిల్లా పార్టీ కార్యాలయంలో ‘జగనన్న 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- ప్రతి గ్రామం, మండలం, వార్డులో కార్యకర్తలకు అనుసంధాన వేదికగా యాప్
- ప్రతి వైసీపీ కార్యకర్త తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపు
- ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను యాప్‌లో నమోదు చేయాలని సూచన
విజయవాడ, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ‘జగనన్న 2.0 సూపర్ యాప్’ సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పునూరు గౌతమ్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీలతో కలిసి ఆయన ‘జగనన్న 2.0 సూపర్ యాప్’ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ‘జగనన్న 2.0 సూపర్ యాప్’ ప్రతి కార్యకర్తకు అండగా నిలిచే డిజిటల్ వేదిక అని అన్నారు. గ్రామం నుంచి మండలం, వార్డు వరకు నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య బలమైన అనుసంధాన వారధిగా ఈ యాప్ పనిచేస్తుందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను నమోదు చేసి పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. యాప్ ప్రారంభమైనప్పటి నుంచే కూటమి ప్రభుత్వానికి దడ మొదలైందని వ్యాఖ్యానించిన ఆయన, ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ యాప్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పనిసరిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, ప్రజా సమస్యలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్రతినిధులు కూడా యాప్‌ను సమర్థవంతంగా వినియోగించి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు నేరుగా పార్టీ నాయకత్వానికి చేరేలా ఈ యాప్‌ను రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం పత్రికలు, టెలివిజన్, సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ వేదికగా ఈ యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు ప్రజలు తమ సమస్యలు, అభిప్రాయాలను నేరుగా నమోదు చేసుకునే అవకాశం ఇందులో ఉంటుందని చెప్పారు. అవసరమైతే ఈ యాప్ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కూడా సంప్రదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను వినియోగించి ప్రజా సమస్యలను నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
