Telangana | రైతు డిస్కంపై జగదీశ్‌రెడ్డి విమర్శలు

Telangana | రైతు డిస్కంపై జగదీశ్‌రెడ్డి విమర్శలు

‘ఇది రైతుకు ఉరి వేసే డిస్కం’

Telangana | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ప్రతిపాదిత రైతు డిస్కంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది రైతులకు ఉపయోగపడే డిస్కం కాదని, రైతులకు ఉరి వేసే డిస్కంలా మారుతుందని ఆరోపించారు. కొత్త డిస్కం ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌కు డిస్టిబ్యూషన్‌ లైసెన్స్‌ మంజూరు కోసం దాఖలు చేసిన దరఖాస్తుపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి అన్ని రాజకీయ పక్షాలతో అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఈసందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుతం 30లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్న విద్యుత్ సంస్థల్లో సుమారు 13 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి పరిస్థితిలో కొత్త డిస్కం కోసం కేవలం వెయ్యి మంది ఉద్యోగులను నియమిస్తే వ్యవస్థ ఎలా సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో విద్యుత్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త డిస్కం వల్ల సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.

ఆదాయ వనరులు స్పష్టంగా లేని డిస్కంను ఏర్పాటు చేసి దాని పేరుతో అప్పులు ఎలా సమీకరిస్తారని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. “దున్నపోతును మన దగ్గర పెట్టుకుని పాలిచ్చే బర్రెను వేరే వారికి అప్పగించినట్టే ఈ కొత్త డిస్కం వ్యవహారం ఉంది” అని వ్యాఖ్యానించారు. కొత్త డిస్కం ఏర్పాటు కోసం ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఏమాత్రం సమంజసంగా లేవని, దీనిపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.