చట్టాలపై అవగాహన కల్పించాలి

న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తం
నల్గొండ, ఆంధ్రప్రభ : రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు సంస్థ ద్వారా వివరించాలని న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తం అన్నారు. ఆదివారం జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (NALSA), రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ (TSLSA) వారి ఆదేశాలతో న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండలోని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు అయన తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహిచడం, కుటుంబ వివాదాలను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు.
న్యాయ సహాయం అవసరం ఉన్న వాళ్ళు న్యాయ సేవ సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ఈ నెల 15వ తేదీన జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మొదలైన పరిష్కరించుకోగలరని ఆయన కోరారు. పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సహాయం అందిస్తూ న్యాయ సేవ అధికార సంస్థకు, ప్రజలకు మధ్యన వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమములో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్ట అనంత రెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎన్.భీమార్జున్ రెడ్డి, న్యాయ సేవ అధికార సంస్థ నామినేటెడ్ మెంబెర్ కట్ట వెంకట్ రెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎం.లెనిన్ బాబు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
