రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం

రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం
- మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: రాబోయే వానాకాలం సీజన్‌ను పురస్కరించుకుని చౌటుప్పల్ మండలంలోని రైతులకు భూసారాన్ని పెంపొందించే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందిస్తోందని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) ముత్యాల నాగరాజు తెలిపారు. చౌటుప్పల్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) లో రైతులకు పంపిణీ చేయడం కోసం ఈ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు బుధవారం ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం కేంద్రంలో జీలుగ, జనుము విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఏఓ వివరించారు. జీలుగ 30 కిలోల బ్యాగ్ అసలు ధర రూ. 4,905 కాగా, 50 శాతం రాయితీ పోను రైతు కేవలం రూ. 2,452.50 చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం 167 జీలుగ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
జనుము 40 కిలోల బ్యాగ్ అసలు ధర రూ. 6,220 కాగా, సబ్సిడీపై రైతు చెల్లించవలసిన నికర ధర రూ. 3,110 మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో 17 జనుము బ్యాగులు నిల్వ ఉన్నాయని చెప్పారు.
సబ్సిడీపై ఈ పచ్చిరొట్ట విత్తనాలను పొందాలనుకునే రైతు సోదరులు తమ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు), పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని కోరారు. విత్తనాల పంపిణీ, ఇతర పూర్తి వివరాల కోసం రైతులు నేరుగా చౌటుప్పల్ పీఏసీఎస్ కేంద్రాన్ని సంప్రదించాలని నాగరాజు సూచించారు.
