రామేశ్వర స్వామి ఆలయ దోపిడీ కేసు ఛేదన….

రామేశ్వర స్వామి ఆలయ దోపిడీ కేసు ఛేదన….
మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అరెస్ట్ – 4 కిలోల వెండి స్వాధీనం….
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో సంచలనం సృష్టించిన కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు నాలుగు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్వబుగ్గలో ఉన్న శ్రీ బ్రమరాంబ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో మార్చి 16, 17 తేదీల మధ్య రాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడి సుమారు 10 కిలోల వెండి వస్తువులను అపహరించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన అర్జున్ పూనం కుంబ్హర్ (పుణె), అక్షయ్ జైసింగ్ ఠాకూర్ (చించ్వడ్)లను ఏప్రిల్ 5న సాయంత్రం అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు తమ సహచరులు జెర్నల్, అమిత్, బజరంగి లతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డారని విచారణలో తేలిందన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.

నిందితులు ముందుగా ఆలయ పరిసర ప్రాంతాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించి, రెక్కీ నిర్వహించి, అనంతరం రాత్రి వేళ తాళాలు కట్ చేసి లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని వెల్లడించారు. టోల్ గేట్లలోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితుల వద్ద నుంచి వెండి నాగాభరణాల ముక్కలు, వెండి సింహ విగ్రహ భాగాలు, అమ్మవారి పీఠం ముక్క, ధారాపాత్ర వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అలాగే దొంగతనానికి ఉపయోగించిన బోల్ట్ కట్టర్, స్క్రూ డ్రైవర్లు, గ్లౌజులు, నిందితుల వాహనం మారుతి సుజుకి వ్యాగన్తో పాటు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రవాడ ఎల్లమ్మ ఆలయంలో జరిగిన చోరీతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ కొనసాగుతోందన్నారు. ఈ కేసును ఛేదించేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, కె. నాగలపురం పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బంది సమన్వయంతో నిందితులను పట్టుకున్నారని వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి, వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఆలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. సాంకేతిక ఆధారాలతో దొంగల వేట… మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగింపు.
