పదిలో లింగాపూర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. వెంకటరమణ మాట్లాడుతూ, పాఠశాల నుంచి మొత్తం 117 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 115 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ మేరకు పాఠశాల 98.28 శాతం ఉత్తీర్ణత సాధించింది.
ఈ ఫలితాల్లో వి. వెంకటకృష్ణ 569 మార్కులు సాధించి కడెం మండల టాపర్‌గా నిలిచారు. అలాగే పాఠశాల విద్యార్థుల్లో 46 మంది 500కు పైగా మార్కులు, 57 మంది 400కు పైగా మార్కులు, 12 మంది 300కు పైగా మార్కులు సాధించారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం బి. వెంకటరమణతో పాటు స్థానిక గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్, ఉప సర్పంచ్ కమ్ముల లక్ష్మీ స్వామి, మాజీ కడెం జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ పి. రాజేశ్వర్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
