Taiwan Athletics Open | మ‌రోసారి స‌త్తా చాటిన‌ జ్యోతి…

తైపీ : తైవాన్ రాజధానిలో జరుగుతున్న తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్-2025 లో భారత అథ్లెట్లు దూసుకొస్తున్నారు. ముఖ్యంగా తెలుగు తేజం అథ్లెట్ జ్యోతి యర్రాజీ మరోసారి తన క్లాస్ చూపించి, మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ రేసులో గోల్డ్ మెడల్ సాధించింది.

12.99 సెకన్లలో పసిడి పతకం

ఈ రోజు (శనివారం) జరిగిన ఫైనల్లో జ్యోతి 12.99 సెకన్లలో రేసును పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. ప్రారంభంలో వెనుకపడినా, చివరి రెండు హర్డిల్స్ వద్ద స్పీడ్ పెంచి అందరినీ వెనక్కి నెట్టి గెలుపొందింది.

జ్యోతితో పాటు భారత్‌కు మ‌రో ముగ్గురు అథ్లెట్లు గోల్డ్ మెడల్స్ సాధించారు. దీంతో భార‌త్ ఖాతాలో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు బంగారు పతకాలు చేరాయి.

పతక విజేతలు:

జ్యోతి యర్రాజీ – మహిళల 100m హర్డిల్స్ (12.99 సెకన్లు)
తేజస్ శిర్సే – పురుషుల 110m హర్డిల్స్ (13.52 సెకన్లు – వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన)
అబ్దుల్లా అబూబక్కర్ – పురుషుల ట్రిపుల్ జంప్ (16.21 మీటర్లు)
పూజా – మహిళల 1500m పరుగులో విజయం (4:11.65 సెకన్లు)

ఈ విజయంలో భారత అథ్లెట్ల ప్రదర్శన పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఇప్పటికే నాలుగు స్వర్ణ పతకాలు ఖాతాలో వేసుకున్న భారత్, పతకాల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంకా కొన్ని ఈవెంట్లు మిగిలివుండటంతో పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

జ్యోతి ఫామ్ అదుర్స్ !

జ్యోతి ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లోనూ గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ పోటీలో 100 మీటర్ల హర్డిల్స్‌ను 12.96 సెకన్లలో పూర్తి చేసిన జ్యోతి.. ఇప్పుడు తైవాన్‌లోనూ స‌త్తా చాటుతోంది.

అంతేకాకుండా, ఈ ఏప్రిల్‌లో కేరళలో జరిగిన నేషనల్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్, ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌ నేషనల్ గేమ్స్ లోనూ ఆమె డబుల్ గోల్డ్ (100m హర్డిల్స్, 200m పరుగులు) సాధించింది.

Leave a Reply