మండల సర్వేయర్‌పై విచారణకు తూట్లు.

మండల సర్వేయర్‌పై విచారణకు తూట్లు.

ఆదేశాలిచ్చి రోజులు గడుస్తున్నా కదలని ఫైలు..
అవకతవకలపై అధికారుల కాలయాపన.

ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మండల సర్వేయర్‌పై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు చర్యలు శూన్యం. సదరు సర్వేయర్ చేసిన సర్వేల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

రీ-సర్వే డీటీ దగ్గరే కీలక ఆధారాలు

రీ-సర్వే డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్లు, రికార్డుల ఆధారంగా విచారణ చేస్తే సర్వేయర్ అవకతవకలు నిమిషాల్లో బయటపడతాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఫీల్డ్‌లో సర్వే చేయకుండానే రికార్డులు తారుమారు చేశారని, ప్రభుత్వ భూముల సరిహద్దులు మార్చేశారని, అర్హులకు కాకుండా అనర్హులకు పట్టాలు వచ్చేలా నివేదికలు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఫిర్యాదులు వెల్లువ.. స్పందన శూన్యం

గత ఆరు నెలలుగా రైతులు, భూ యజమానులు కలెక్టరేట్‌లో, ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తున్నా విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. ‘విచారణ చేస్తున్నాం’ అంటూ అధికారులు కాగితాలపై కాలం వెళ్లదీస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క అడుగూ ముందుకు పడలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి ఒత్తిడి..?

సర్వేయర్‌పై చర్యలు తీసుకోకుండా అధికారులను అడ్డుకుంటున్నది ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ ఒత్తిళ్లా, పైస్థాయి అధికారుల అండదండలా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలకు పాల్పడిన సర్వేయర్‌ను కాపాడేందుకే విచారణను నీరుగారుస్తున్నారని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

కలెక్టర్ జోక్యం చేసుకోవాలి

రీ-సర్వే డీటీ వద్ద ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకుని, స్వతంత్ర అధికారితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కాలయాపన చేస్తున్న అధికారులపై, అవకతవకలకు పాల్పడిన సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

భూ వివాదాలకు కారణమవుతున్న సర్వేయర్‌ను విచారించకుండా రక్షించే ప్రయత్నం చేస్తే రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని సీనియర్ అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.