తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం..

  • మెడికవర్ హాస్పిటల్స్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం
  • సందర్భంగా అవగాహన సదస్సు
  • మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి : వైద్యుల సూచన

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని, పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువుకు జీవితాంతం ఆరోగ్యకరమైన బాట వేయవచ్చని మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్స్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి–శిశు ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని వైద్యులు వివరించారు.

ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవం ప్రధాన ఉద్దేశం తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన పెంపొందించడం, ప్రతి శిశువుకు ఆరోగ్యకరమైన జీవితానికి తల్లిపాలే ఉత్తమ ఆరంభమనే సందేశాన్ని సమాజానికి చేరవేయడమేనని వైద్యులు తెలిపారు.

మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఉత్తమ ఆహారం

నియోనాటాలజిస్ట్, శిశువైద్య నిపుణురాలు డాక్టర్ సింధూర రెడ్డి మాట్లాడుతూ.. పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు అందించడం అత్యంత కీలకమని తెలిపారు. పుట్టిన తర్వాత తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు, వ్యాధినిరోధక శక్తి సహజంగానే లభిస్తాయని వివరించారు. తల్లిపాలు ఇన్‌ఫెక్షన్లు, విరేచనాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె చెప్పారు.

మెదడు ఎదుగుదలకు తల్లిపాలే బలం

శిశువైద్య నిపుణురాలు డాక్టర్ అనూష మాట్లాడుతూ తల్లిపాలు శిశువు శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధికి కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. తల్లిపాలను నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయ ఆహారం ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.

అపోహలు వీడి… కుటుంబ సభ్యుల సహకారం అవసరం

తల్లిపాలపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైద్యులు పేర్కొన్నారు. ఉద్యోగినులు సహా ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలు అందించేలా కుటుంబ సభ్యులు సహకరించాలని సూచించారు. తల్లిపాలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన భావితరాన్ని నిర్మించవచ్చని వారు పేర్కొన్నారు.

అత్యాధునిక సేవలతో తల్లి–శిశు సంరక్షణ

మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హాస్పిటల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి శిశువుకు తల్లిపాలు ప్రకృతి అందించిన అపూర్వమైన వరమని అన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి చేరవేయడం సమాజ బాధ్యతగా పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలతో పాటు తల్లిపాలపై అవగాహన కార్యక్రమాలు, పాలిచ్చే తల్లులకు ప్రత్యేక సలహా సేవలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అందిస్తున్నామని తెలిపారు. ప్రతి తల్లి ఆత్మవిశ్వాసంతో తన బిడ్డకు తల్లిపాలు అందించేలా అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం అందించేందుకు ఆసుపత్రి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.