ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహమే లక్ష్యం
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహమే లక్ష్యం
ప్రకృతి సేద్య ఉత్పత్తులతో రైతులు, వినియోగదారులకూ మేలు
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్‌ను సందర్శించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
(విజయవాడ, ఆంధ్రప్రభ ) ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లోప్రారంభించిన మొబైల్ వెహికల్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయంసమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులకు భరోసా కలగడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించిన మంత్రి, ప్రతి ఒక్కరూ సహజ సాగు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఇటువంటి సానుకూల మార్పులు రాష్ట్ర ప్రగతికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వి.నాగప్రమీల రాణి, ప్రకృతి వ్యవసాయ రైతులు, అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.
