ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి

ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి
ఉన్నత సాంప్రదాయాన్ని పాటిస్తున్న జిఎంఆర్ ఎం సి హై స్కూల్
ఘనంగా నివాళులర్పించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ రామరాజ్య నగర్ జిఎంఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో బుధవారం కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన పాఠశాల సిబ్బంది, అధ్యాపకులు ,విద్యార్థులు.ఒక ఉన్నత సాంప్రదాయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాటిస్తున్నారు సాధారణంగా ప్రభుత్వం ప్రకటించిన జాతీయ నేతల వర్ధంతిలు లేదా జయంతుల రోజులలో మాత్రమే పాఠశాలలలో ఆ నేతలకు నివాళులర్పిస్తారు అయితే ఈ పాఠశాలలో మాత్రం ప్రతి రోజుకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను తీసుకొని ఆరోజు జన్మించిన లేదా మరణించిన ఏ రంగానికి చెందిన ప్రముఖుల నైనా ఛాయాచిత్రాన్ని పాఠశాల ఆవరణలో అసెంబ్లీలో ప్రదర్శించి విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి నివాళులర్పిస్తారు .
ఇలా ఇంచుమించుగా ప్రతిరోజు ఒక ప్రముఖ వ్యక్తికి నివాళులర్పిస్తూ వారి గొప్పతనాన్ని పాఠశాల అసెంబ్లీలో వివరించి విద్యార్థులతో చెప్పించి కొన్ని సందర్భాలలో వివిధ రకాల పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థులలో క్రొత్త చైతన్యాన్ని కలిగిస్తున్నారు .పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివి రవికుమార్ , ఈ పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు పడమట శ్రీనివాసరావు గతంలో ఈ పాఠశాలకు సుమారు 150 మంది ప్రముఖుల చిత్రపటాలను సేకరించారు.అలాగే ప్రస్తుత పాఠశాల గణిత ఉపాధ్యాయులు పులిపాటి దుర్గారావు తెలుగువారిలో ప్రముఖుల చిత్రాలను అలాగే అవసరమైన చిత్రాలను అంతర్జాలం ద్వారా సేకరించి ఈ ఛాయాచిత్రాలను సందర్భానుసారంగా ప్రదర్శిస్తూ ఉంటారు.అంతేకాక వారి జీవిత చరిత్రలపై పోటీలను కూడా నిర్వహిస్తుంటారు .
అలాగే పాఠశాల ఆవరణలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు ,సరస్వతి దేవి ,అబ్దుల్ కలాం విగ్రహాలకు ప్రతిరోజు ఉపాధ్యాయులు లేదా పాఠశాలలో ఏదైనా ప్రత్యేకత సాధించిన విద్యార్థులతో పూలమాలలతో అలంకరిస్తారు.పాఠశాలకు వచ్చే అతిధులతో కూడా ఈ విధంగానే ఆ విగ్రహాలకు నివాళులర్పిస్తారు .ఈ విధంగా పాఠశాలలో విద్యార్థులలో జాతీయ స్ఫూర్తి దేశభక్తి , జనరల్ నాలెడ్జ్ పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.అంతేకాకుండా ప్రముఖుల సంతకాలను కూడా సందర్భానుసారం విద్యార్థులకు ప్రదర్శన ఏర్పాటు చేస్తుంటారు .ఇలా చరిత్రలో నిలిచిపోయిన మన జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు జాతి నాయకులు సాహితీ ప్రముఖులను విద్యార్థులకు పరిచయం చేయటం అరుదైన విషయం.జాతీయ పర్వదినాలు ,ప్రభుత్వ ప్రకటిత ఉత్సవాలలోనే కాక ఇలా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం గా చేయడం ద్వారా ఆరోజు పుట్టినటువంటి విద్యార్థులు తమ పుట్టినరోజు నాడు పలానా ప్రముఖుల వర్ధంతి లేదా జయంతి అని గుర్తుపెట్టుకోవటం ద్వారా వారి స్ఫూర్తిని కూడా విద్యార్థులు పొందగలుగుతున్నారు.
