బీసీ బిడ్డపై నిందారోపణలు చేస్తే సహించబోం

బీసీ బిడ్డపై నిందారోపణలు చేస్తే సహించబోం

బీసీ సంఘ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బోళ్ళ కరుణాకర్

సూర్యాపేట , ఆంధ్రప్రభ :
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దుర్మార్గపు చర్య అని బీసీ సంఘ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బోళ్ళ కరుణాకర్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలం పాటు శాసన సభ్యులుగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ప్రజల మద్దతుతో రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని గుర్తు చేశారు.

రాజకీయంగా అవగాహన లేని వ్యక్తులు రాత్రికి రాత్రే దొంగ చాటుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజేందర్ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులే ఈ దుర్మార్గపు చర్యకు పాల్బడి ఉంటారన్నారు. త్వరలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణలో ఈటలకు స్థానం లభించబోతుందని కావాలనే సొంత పార్టీ నేతలే ఈ చర్యను ప్రోత్సహించి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. వక్రబుద్ధి బుద్ధి కలిగిన నాయకులు బీసీ బిడ్డపై నిందారోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్ది సంఘ రాష్ట్ర జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్, నాయకులు ముద్ద బిక్షపతి యాదవ్, బొర్ర విజయ్, పేరాల సాయి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply