TDP office | పసుపు పండుగ‌కు చంద్ర‌బాబు శ్రీకారం

TDP office | పసుపు పండుగ‌కు చంద్ర‌బాబు శ్రీకారం

TDP office | వర్చువల్‌గా మ‌హానాడు..
1875 క్లస్టర్ల‌ వేదికగా పాల్గొంటున్న త‌మ్ముళ్లు
ప్రారంభ ప్ర‌సంగంతో జోష్ నింపిన టీడీపీ అధినేత‌
విజ‌న్ పాలిటిక్స్‌కు నాంది ప‌లికిన‌ తెలుగుదేశం
మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం మారలేదు
చంద్రయ్య త్యాగాన్ని గుర్తు చేసిన అధినేత‌ చంద్ర‌బాబు
సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై వివ‌రంగా విశ్లేష‌ణ‌
అన్న నంద‌మూరి స్ఫూర్తి.. పేద‌రికాన్ని రూపు మాప‌డ‌మే ప‌ర‌మావ‌ధి

TDP office | అమ‌రావ‌తి, ఆంధ్ర‌ప్ర‌భ : విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని.. ప్రతి అడుగు సంచలనమే అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బుధ‌వారం నుంచి రెండు రోజుల పాటు జ‌రిగే మహానాడు వేడుకల‌ను జ్వోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన లాంఛ‌నంగా ప్రారంభించి ప్రసంగించారు. అంత‌కుముందు చంద్రబాబు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు.

సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలన..

ఈ సంద‌ర్భంగా పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు మాట్లాడుతూ.. 1875 క్లస్టర్ల‌ వేదికగా ఈసారి మహానాడు జరుగుతోందన్నారు. లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారని ప్రశంసించారు. పశ్చిమాసియా యుద్ధవాతావరణం మూలంగా మహానాడును వర్చువల్‌గా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ‘సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు’ అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనను టీడీపీ పరిచయం చేసిందని ప్రస్తావించారు. జెండర్ ఈక్వాలిటీ, సామాజిక సమస్యలపై తెలుగుదేశం పోరాడిందని చంద్రబాబు పేర్కొన్నారు.

కార్యకర్తల్లో జోరు తగ్గలేదు..

వర్చువల్ మహానాడు కారణంగా వాహానాల హోరు తగ్గిందేమో కానీ.. కార్యకర్తల్లో జోరు తగ్గలేదని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. అన్ని క్లస్టర్లను అనుసంధానించి మహానాడును నిర్వహిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల మహానాడును హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని వివరించారు. మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం మారలేదన్నారు. భవిష్యత్తు గురించి అన్ని విషయాలు చర్చించుకుందామని తెలిపారు. కూడు, గూడు, నీడ లాంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించిందని ప్రస్తావించారు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసమని ఉద్ఘాటించారు. ప్రతీ ఒక్కరికీ తెలుగుదేశం జెండా చూస్తేనే నమ్మకం, భరోసా కలుగుతోందన్నారు. నాటికి, నేటికి టీడీపీపై ప్రజలకు ఆదరణ చెక్కు చెదరలేదన్నారు. 45 ఏళ్లుగా ప్రజాసమస్యల కోసం టీడీపీ నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.

చంద్రయ్య స్పూర్తి కలకాలం నిలుస్తుంది..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు వచ్చినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజా పోరాటాలు ఆపలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ హయాంలో నరహంతకులు పీకలు కోస్తున్నా.. టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాను వీడలేదు. చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినదించి అమరుడయ్యారు. ఆయన స్ఫూర్తి కలకాలం నిలుస్తోంది. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, లోకేష్‌ యువగళాన్ని అడ్డుకున్నారు. మన నేతలను అరెస్టు చేశారు. బాధితులనే నిందితులుగా చేశారు. అయినా టీడీపీ వెనకడుగు వేయలేదు. ప్రజాస్వామ్యం కోసం టీడీపీ నిలిచింది. ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత అప్పగించారు. పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నాం.

మ‌హిళా సాధికార‌త కోసం..

మహిళా సాధికారిత, సామాజిక, ఆర్థిక రాజకీయ గౌరవం కోసం టీడీపీ పనిచేస్తోందని చంద్ర‌బాబు అన్నారు. ఆస్తి హక్కు నుంచి.. నేడు తల్లికి వందనం వరకూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ టీడీపీ వారి వెనుక ఉంటుంది. ఒకప్పడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చాం. ఇది చూసే నా చిన్నప్పుడు ఇష్టంగా నడిపిన రాయల్ ఎన్‌ఫిల్డ్ కూడా రాష్ట్రానికి వచ్చింది. 1875 ప్రాంతాల్లో మహానాడు హైబ్రిడ్ సమావేశం జరుగుతోంది. ఏ తీర్మానానికి ఎంతమంది ఆమోదం తెలిపారో రియల్ టైంలో వస్తున్నాయి. బెస్ట్ టెక్నాలజీ ప్లస్‌ని ఇక్కడికి తెస్తామని యువతకు విజ్జప్తి చేస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, ఆర్ధికంగా మహిళలకు చేయూత ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రభుత్వంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.

CLICK HERE TO READ AP CM | చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు

CLICK HERE TO READ MORE

Leave a Reply