వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ మృతి
వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ మృతి
ములుగు రూరల్, ఆంధ్రప్రభ:
ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ శ్రీపాద సుశీల (61) వడదెబ్బ కారణంగా మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సుశీల జంగాలపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వస్తుండేవారు.
ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. “నాకు ఎట్లనో అవుతోంది” అని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన సుశీల మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆమెనే పెద్ద దిక్కుగా ఉండటంతో ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
