నాలుగు రోజులుగా వెలగని వీధి దీపాలు.. చీకట్లోనే కాలనీల ప్రజలు
తాడ్వాయి, ఆంధ్రప్రభ: మండలంలోని చిట్యాల గ్రామంలో గత నాలుగు రోజులుగా ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకటి అలుముకోవడంతో సంచరించేందుకు భయంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీధి దీపాల సమస్యపై పలుమార్లు గ్రామ లైన్‌మన్‌కు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని, ఫోన్ చేసిన వారితో దురుసుగా మాట్లాడుతున్నారని గ్రామస్థులు పులి ప్రభాకర్, శంభల మైపాల్ ఆరోపించారు. విద్యుత్ పనుల కోసం అవసరమైన ఎల్‌సీ (లైన్ క్లియరెన్స్) అనుమతి కూడా సకాలంలో ఇవ్వడం లేదని, దీనిపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై వరంగల్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
బీసీ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ లైన్‌మన్, హెల్పర్ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామానికి రాకుండా విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇకనైనా గ్రామంలో అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
