‘ఓటరు సర్’కు సముచిత స్థానం.. ప్రజాస్వామ్యంలో ఓటరే కేంద్రబిందువు

‘ఓటరు సర్’కు సముచిత స్థానం.. ప్రజాస్వామ్యంలో ఓటరే కేంద్రబిందువు

  • ఓటరు నమోదు ప్రక్రియపై పెరుగుతున్న సందేహాలు
  • ఓటు హక్కు.. రాజ్యాంగ హక్కా? చట్టబద్ధ హక్కా?
  • ఎన్నికల జాబితా సవరణలో సరళత అవసరం
  • వదంతులకు చెక్ పెట్టేలా ప్రభుత్వ స్పష్టత కీలకం
  • నిజమైన ఓటరుకు గౌరవం పెరిగితేనే ప్రజాస్వామ్యం బలోపేతం

ఓటుకోవటం ఎలా? అని రాజకీయ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తుంటే, ఓటర్ను గుర్తించటం ఎలా? అని ‘సర్’ ఆపసోపాలు పడుతున్నది! ఎలక్షన్ల ముందు డబ్బూ దస్కంతో రాజకీయ నాయకులు ఓటర్ల చుట్టూ తిరుగుతుండటం ఎన్నోసార్లు చూసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాలతో బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓస్) నిజమైన ఓటరు ఎవరో నమోదు చేసేందుకు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు!

చాలామంది ఓటర్లు మా ఓట్లు ఎలా నమోదు అయ్యాయో మాకు తెలియదు! ఓట్లు వేసే రోజును **’ఓట్ల పండుగ’**గా భావించి ప్రభుత్వంలోనివారో, పార్టీలోవారో ఇచ్చిన చీట్లను బూత్‌లలోకి వెళ్లి అక్కడున్న అధికారులకు చూపించి రహస్యంగా ఓటు వేసి వచ్చే వాళ్లం! అంత తేలిగ్గా జరిగిపోయిన ప్రక్రియ ఇప్పుడు ఎందుకింత కష్టతరమైంది! సామాన్యుడికి అర్థం కాని సమస్య! ఓటు ఉంటేనే నీవు దేశంలోని పౌరుడివి అని వ్యాప్తి చెందుతున్న వదంతులను నమ్మాలా? నమ్మకూడదా? తెలియని పరిస్థితి! ఇక్కడే పుట్టి పెరిగి జీవనం సాగిస్తున్న నేను దేశ పౌరుడిని కానా? అసలు ఆ అనుమానం కల్పించాల్సిన అవసరం ఎందుకొచ్చింది!

దేశంలోకి చొచ్చుకొని వచ్చిన ఇతర దేశస్థులనూ, దొంగ ఓటర్లనూ, లెక్కకు మించిన ఓట్లను అనేక చోట్ల కలిగిన వారిని గుర్తించే సులభమైన మార్గాన్ని ప్రభుత్వాలు కనుక్కోలేకపోయాయా? సాంకేతికంగా తారాస్థాయిలో ఉన్న మన దేశం చిన్నపాటి విషయానికి పరిష్కారం కనుక్కోలేక అసలు సిసలైన ఓటరును నమోదు చేసుకోటానికో, ధృవీకరించుకోటానికో ఇంత తతంగం, ఇంత హైరానా అవసరమా?

సగటు మనిషికి అర్థమయ్యే రీతిలో విషయం ఉండకపోతే సమస్యగా మారుతుంది! ఓటు లేకపోతే దేశ పౌరుడివి కావు అని ఎవరో రేపిన అనుమానంతో దేశపు సగటు జీవి ‘సర్’ తలపెట్టిన ప్రక్రియతో సతమతమవుతున్న మాట నిజం! ఇదంతా కావాలని కొందరు ఓటర్లను తప్పించటానికి ప్రభుత్వాలు ప్లాన్లు వేసాయని వినిపిస్తున్న వదంతులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి! కొన్నేళ్ల తర్వాత ‘రివిజన్’ ప్రక్రియను మొదలుపెట్టామని అధికారులు చెబుతున్నారు కానీ, మీడియా, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల ఎన్నికల అనుభవాలు సామాన్యుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

రాజ్యాంగ నిపుణులు మరో మాట చెప్పి మరింత ఉత్కంఠను కలిగిస్తున్నారు! ‘నోటా’ గురించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉందని, కానీ ఓటు హక్కు గురించి స్పష్టత లేదని చెబుతుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది! ‘ఫండమెంటల్ హక్కు’గా ఓటు హక్కు ఎందుకు లేదన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది! కోర్టులు కూడా ‘ఓటు హక్కు ఫండమెంటల్ హక్కు కాదు.. స్టాట్యుటరీ హక్కు మాత్రమే’ అని పేర్కొనడం చర్చకు దారితీసింది.

ప్రజాస్వామ్యాన్ని అవలంభించిన దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలంటే ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అందుకే ఓటు అంత విలువైనది, ప్రజాస్వామ్యానికి అంత ముఖ్యమైనది. అయినప్పటికీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఓటు హక్కు లేకపోవడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నికల నిర్వహణ, అర్హతలు, అనర్హతల విషయంలో స్పష్టత లోపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రమైన విషయం ఏమిటంటే, కోర్టు తీర్పుల ప్రకారం అభ్యర్థి వివరాలు తెలుసుకోవడం ప్రాథమిక హక్కు, ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేయడం హక్కు, రహస్య ఓటింగ్ కూడా ప్రాథమిక హక్కు, ‘నోటా’ కూడా హక్కుగా పరిగణించబడుతోంది. కానీ ఓటు హక్కు మాత్రం చట్టబద్ధమైన హక్కుగానే కొనసాగుతోంది.

రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య పాలన అమలులోకి వచ్చినప్పుడు, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగాలంటే పౌరుడి ఓటు హక్కును ఎందుకు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలలో చేర్చలేకపోయారన్న ప్రశ్న అనేక విమర్శలకు, విశ్లేషణలకు దారితీస్తోంది. కోర్టులు ఎన్నికల విషయాల్లో తరచూ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజలకూ, ప్రభుత్వాలకూ, కోర్టులకూ క్లిష్ట పరిస్థితులను తీసుకొస్తోంది.

ఇప్పుడు నిజమైన ఓటరును మరోసారి ఎలక్టోరల్ రోల్స్‌లో చేర్చే కార్యక్రమం మంచిదే కావచ్చు. కానీ అసలు సిసలైన ఓటరుకు అనవసరపు తలనొప్పులు తెచ్చిపెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొత్త ఓటర్ల జాబితా తయారీని ఎవరూ వ్యతిరేకించరు. అయితే ప్రక్రియను సరళంగా, సులభంగా రూపొందించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కొన్ని సూచనలు:

1) ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఓటు వేస్తున్న వారిని ‘నిర్ధారిత ఓటర్లు’గా గుర్తించి, మళ్లీ పూర్తి ధృవీకరణ అవసరం లేకుండా జాబితాలో కొనసాగించవచ్చు.

2) దొంగ ఓటర్ల వివరాలు ఇప్పటికే పోలీసు, ఎన్నికల రికార్డుల్లో ఉన్నందున వారిపై మాత్రమే ప్రత్యేక ఎన్యూమరేషన్ నిర్వహించవచ్చు.

3) మరణించిన వారి పేర్లను రెవెన్యూ, పోలీసు, ఎన్నికల అధికారులు సమన్వయంతో తొలగించవచ్చు.

4) రాజకీయ పార్టీలు, నిఘా సంస్థల సహకారంతో అక్రమ ఓటర్లను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.

ఇలాంటి నిర్దిష్టమైన విధానాలతో ఎన్యూమరేషన్ ప్రక్రియను సులభతరం చేయవచ్చేమో!

నిజమైన అసలు సిసలైన ఓటరును గౌరవించడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం కావాలి. అందుకే అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేసి ఓటు హక్కును ప్రాథమిక హక్కులలో చేర్చాలని రచయిత అభిప్రాయపడుతున్నారు.

ఓటు లేకపోతే పౌరసత్వం కూడా పోతుందనే వదంతులను నివారించేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్య విలువలకు గౌరవం లభించినట్లవుతుందని పేర్కొన్నారు.